ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న కేబినెట్ కూర్పుపై క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టారు. వచ్చే గురువారం రాష్ట్రపతి భవన్‌లో మోదీతోపాటు బీజేపీ, ఎన్డీయే పక్షాలకు చెందిన పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరి పేరునూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, బీజేపీలోని ప‌రిణామాల ప్ర‌కారం ప‌లు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇందులో కొంద‌రికి ప్ర‌మోష‌న్ వార్త‌లు వ‌స్తుండ‌గా...ఇంకొంద‌రికి డిమోష‌న్ ఖాయ‌మంటున్నారు. 


బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందిది. ఆయనకు బిగ్-4గా పిలిచే హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖల్లో ఒకదాన్ని అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక శాఖను మళ్లీ అరుణ్‌జైట్లీకి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి.  అయితే, జైట్లీ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా తప్పుకుంటే రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు పీయుష్‌గోయల్ రెండుసార్లు తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలు చూసుకున్నారు. 2015-16 బడ్జెట్‌ను, ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. అయితే జైట్లీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, పుకార్లు నమ్మొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


కాగా, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న స్మృతిఇరానీకి ఈసారి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని అమేథీలో ఓడించడంతోపాటు నాలుగు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని బీజేపీ వశం చేసినందుకు ఆమెకు తగిన బహుమతి దక్కుతుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో తగిన ప్రాతినిధ్యం ఇస్తారని అంచనా. బెంగాల్ ఎంపీల్లో ఒకరిద్దరికి మంత్రి పదవులు వరిస్తాయని, ముఖ్యంగా కొత్త వారికి అవకాశం దక్కవచ్చని పేర్కొంటున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ మేరకు స్ప‌ష్ట‌త రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: