గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోడీ, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్​లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై మోడీ, అమిత్​ షా బుధవారం సమావేశమై చర్చించారు. అమిత్​ షా ఇంట్లో సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలోనే కేబినెట్​ బెర్త్​లకు పలువురి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా నాయకులను గురువారం ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  మంగళవారం కూడా మోడీ, షా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు.


నాలుగైదు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. అన్ని రాష్ట్రాలకు ఈ కేబినెట్​లో అవకాశం కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్​ పరిధి పెరుగనుంది. ఎన్టీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన, జేడీయూకు ఈ సారి కేబినెట్​లో అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అప్నాదళ్​కు కూడా మరోసారి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్​, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువ కేబినెట్​ బెర్త్​లు కేటాయిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. తెలంగాణలోనూ నాలుగు చోట్ల బీజేపీ గెలువడంతో ఇక్కడి నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.


ఇదిలాఉండ‌గా,  ఈ ద‌ఫా మోడీ జంబో కేబినెట్ ఉంటుంద‌ని అంటున్నారు. వాస్తవానికి కేంద్ర కేబినెట్​లో 80 మందికి చాన్స్​ ఉంటుంది. దాదాపు ప్రతిసారి 60 నుంచి 70 లోపే మంత్రులతో కేబినెట్​ కొనసాగుతోంది. అయితే.. ఈసారి మోడీ కేబినెట్​లో 70 మందికిపైగా మంత్రులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం కొందరికి, అటు తర్వాత  విస్తరణలో మరికొందరికి అవకాశం కల్పించనున్నారు. మరోవైపు అంతగా ప్రాధాన్యం లేని కొన్ని శాఖలను విలీనం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. కొత్త మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో డ్రింకింగ్​ వాటర్​ మిషన్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే చాన్స్​ ఉంది. గత కేబినెట్​లో ఆయూష్​ అనే కొత్త మంత్రిత్వ శాఖను మోడీ ఏర్పాటు చేశారు. ఈ సారి కేబినెట్​లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: