మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. ఫలితాలు వెల్లడైన దగ్గర నుండి జనాలు మనకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు ఇపుడిపుడే వాస్తవంలోకి వస్తున్నారు. ఇన్ని రోజుల సమీక్షల తర్వాత టిడిపి ఓటమికి ప్రధానంగా ఐదు అంశాలే కారణమని నిర్ధారణకు వచ్చారు.

 

తాజాగా తిరుపతి నేతలతో మాట్లాడిన చంద్రబాబు పార్టీ ఓటమికి ప్రధానంగా ఐదు అంశాలు కారణమని మండిపడ్డారట. నీరు-చెట్టు, హౌసింగ్, ఇసుక అక్రమరవాణ, భూముల ఆక్రమణ, జన్మభూమి కమిటీల ద్వారా టిడిపి నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారంటూ మండిపడ్డారట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పై ఐదు అంశాల్లో అవినీతి భారీగా జరుగుతోందని మొదటి నుండి చంద్రబాబుకు బాగా తెలుసు. జన్మభూమి కమిటిలు ఓ మాఫియాలాగ తయారయ్యాయని స్వయంగా కొందరు టిడిపి నేతలు చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక కేంద్ర పథకమైన  నీరు-చెట్టులో చాలామంది టిడిపి నేతలు అడ్డంగా దోచేసుకున్నారు.

 

పథకం ఏదైనా కానీండి జరిగిన అవినీతి గురించి చంద్రబాబుకు పూర్తి సమాచారం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత జనాలకు ఏదో నాలుగు రూపాయలు పడేస్తే వాళ్ళే ఓట్లేస్తారని చంద్రబాబు అనుకున్నారు. ఆ ధైర్యంతోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు కొన్ని పథకాలు ప్రకటించి డబ్బులు వేశాం మాకు ఓట్లేయండి అన్నట్లుగా మాట్లాడారు.

 

చంద్రబాబు ఉద్దేశ్యంలో జనాలు పిచ్చోళ్ళేమో. అందుకనే చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం వైసిపికి గుద్దారు. తమ డబ్బులే తమకు పథకాల రూపంలో వెదచల్లుతున్నట్లు జనాలు గ్రహించారు. అందుకనే ఓట్ల దగ్గరకు వచ్చేటప్పటికి జనాలు చంద్రబాబుకు మొండి చెయ్యి చూపించారు. అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా పథకాలు, అవినీతే కొంప ముంచాయని అంటుంటే అందరూ నవ్వుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: