ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబునాయుడుకు తొందరలో మరో షాక్ తప్పదని అర్ధమవుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సీనియర్లలో చాలామంది బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఐదేళ్ళపాటు ప్రభుత్వంలో అపరమితమైన అధికారాలను చెలాయించిన వాళ్ళకు అధికారం కోల్పోవటంతో దిక్కు తోచటం లేదు.


అధికారం లేకుండా ఉండలేని స్ధాయికి చేరుకోవటం ఒకటైతే ఇమ్యూనిటీ కోరుకోవటం మరో ఎత్తుగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి నేతలపై అడ్డదిడ్డమైన కేసులు పెట్టించారు. కొందరినైతే రిమాండుకు కూడా వెళ్ళేట్లు చేశారు. దాంతో అదే విధమైన వేధింపులు ఇపుడు తమకు ఎదురవుతాయని భయపడుతున్నారు. అందుకనే ఏదో ఓ పార్టీ అండకోసం తపిస్తున్నారు.

 

అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో జేసి బ్రదర్స్, ధర్మవరంలో వరదాపురం సూరి, పుట్టపర్తిలో పల్లె రఘునాధరెడ్డి బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు పరిటాల సునీత, శ్రీరామ్ కూడా బిజెపిలో చేరటానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 12వ తేదీన వారసులతో కలిసి జేసి బ్రదర్స్ ఢిల్లీ అమిత్ షా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకోనున్నారట. వీరి తర్వాత జిల్లాలోని మిగిలిన నేతలు రెడీ అయిపోతున్నారని సమాచారం.

 

ఇక కర్నూలు జిల్లాకు వస్తే ఆదోనిలో మాజీ ఎంఎల్ఏ మీనాక్షి నాయుడు, ఆలూరులో సీనియర్ నేత వీరభద్రం గౌడ్, కర్నూలులో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, టిజి భరత్, నంద్యాల, ఆళ్ళగడ్డలో భూమా కుటుంబం కూడా బిజెపిలో చేరాలని దాదాపు డిసైడ్ అయినట్లేనట.

 

చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం పోవటంతో పాటు టిడిపికి భవిష్యత్తు లేదని వాళ్ళంతా నిర్ధారణకు వచ్చారట. ముఖ్యమంత్రి కొడుకన్న ఏకైక కారణంతోనే అందరూ నారా లోకేష్ కు ప్రాధాన్యత ఇచ్చారు. నిజానికి లోకేష్ కు ఎటువంటి సామర్ధ్యాలు లేవని ఇపుడు నేతలు అంతరంగిక సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. చివరకు చిత్తూరు జిల్లాలోని చాలామంది నేతలు వైసిపిలో చేరటానికి రంగం  సిద్దం చేసుకున్నారు. అంటే రెండు మూడు నెలల్లో టిడిపిలోని సీనియర్లలో చాలమంది ఇటు బిజెపిలోనో లేకపోతే వైసిపిలోకో వెళ్ళిపోవటం ఖాయంగా తెలుస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: