ఏపీ ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ పార్వతిని స్వర్గీయ ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీపార్వతి నాటి ఎన్నికల ప్రచారంలో చురుకుగ్గా పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యం పెరగడంతో తట్టుకోలేకపోయిన చంద్రబాబు, కుటుంబ సభ్యుల అండతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. దీంతోపాటు ఎన్టీఆర్ బ్యాంక్ అకౌంట్లను స్వాధీనం చేసుకున్నాడు. లక్ష్మీ పార్వతిని చంద్రబాబుతో సహా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మేడ్చల్ గెస్ట్‌హౌస్‌లో బంధించిన కొట్టిన విషయాన్ని  ఇటీవల తిప్పరాజు రమేష్‌లాంటి సీనియర్ జర్నలిస్ట్ బయటపెట్టారు.  


చంద్రబాబు వెన్నుపోటుతో కుంగిపోయిన ఎన్టీఆర్ మనోవేదనతో మరణించారు. దీంతో లక్ష్మీ పార్వతి అప్పటినుంచి చంద్రబాబు మోసంపై ఒంటరి పోరాటం చేస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరిన లక్ష్మీ పార్వతి చంద్రబాబుపై తరచుగా పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన అంశాన్ని  ప్రజలకు వివరించేవారు. తాజాగా చంద్రబాబు ఘోర ఓటమితో తన భర్త ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగిందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.  చంద్రబాబు  ఘోర ఓటమి నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఓటమిపై పాటు, సీఎం జగన్‌ పాలనపై, ఏపీ రాజకీయాలపై లక్ష్మీ పార్వతి  తనదైన శైలిలో అభిప్రాయాలు తెలియజేశారు.  


చంద్రబాబు ఓటమి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకున్నారా అన్న యాంకర్ ప్రశ్నకు లక్ష్మీ పార్వతి సమాధానం ఇస్తూ..తానెప్పుడూ పగ, ప్రతీకారం అనుకోలేదని, చంద్రబాబు వ్యక్తిగత విషయాలపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని, కేవలం తన భర్త ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన అంశం గురించే మాట్లాడానని చెప్పుకొచ్చింది. చంద్రబాబు ఓటమితో ఇక నాకు ఏమి అవసరం లేదని, ఇప్పుడు సంతృప్తిగా ఉందన్నారు. ఇక వైసీపీలో చేరిన విషయంపై స్పందిస్తూ, ఇటు తాను, అటు వైసీపీ ఇద్దరం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఒకే భావజలం ఉండడంతో ఆ పార్టీలో చేరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. 


ఇక  చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదని, తెలంగాణలో పాటు, ఏపీలో కూడా టీడీపీ పూర్తిగా పతనమైందని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ సీఎంగా జగన్ సమర్థవంతంగా పాలిస్తారని కితాబు ఇచ్చారు. జగన్ అవినీతి లేని, పారదర్శమైన పాలన అందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కాబట్టి జగన్ కేంద్రంతో సఖ్యతతో ఉంటూ, రాష్ట్రానికి రావల్సిన నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ..ఆమె అన్నారు. పోలవరం గురించి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మొత్తం పంచుకున్నారని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యతను జగన్ కేంద్రానికి అప్పగించడం మేలు, ఒక వేళ పోలవరం నిర్మాణం పూర్తి కాకపోతే కేంద్రాన్నే ప్రజలు నిందిస్తారు కానీ, జగన్‌ను ఏమి అనరు అని లక్ష్మీ పార్వతి చెప్పారు. 


ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ...అసలు హోదాను సజీవంగా ఉంచిందే జగన్ మోహన్ రెడ్డి అని,  భారీగా నిధులు వస్తాయి కాబట్టి..మొత్తం దోపిడీ చేయవచ్చు అని చంద్రబాబు హోదాకు బదులుగా ప్యాకేజీకి జై కొట్టారని తీవ్రమైన ఆరోపణలు చేసింది. వైయస్ జగన్ ప్రత్యేక హోదా సాధన విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారని..అయితే హోదా ఇచ్చేది కేంద్రం చేతుల్లోనే ఉందని, జగన్ హోదా కోసం రాజీలేని పోరాటం చేయాలని లక్ష్మీ పార్వతి కుండ బద్ధలు కొట్టారు. మొత్తానికి సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలన అందిస్తారని అంటున్న లక్ష్మీ పార్వతి.. చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: