జగన్ కేబినెట్ కూర్పులో తమకు ఖ‌చ్చితంగా మంత్రి పదవి దొరుకుతుందని చివరి వరకూ ఆశించిన వారిలో కొంద‌రికి నిరాశ త‌ప్ప‌లేదు. మంత్రి ప‌ద‌విపై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న వారు త‌మ‌కు కేబినెట్‌లో చోటు లేద‌ని తెలిసిన వెంట‌నే కాస్త షాక్‌లోకి వెళ్లిపోయారు. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి విష‌యంలో చాలా మందే ఆశ‌లు పెట్టుకున్నా జ‌గ‌న్ మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలో మొత్తం ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. వీరిలో ప్ర‌కాశం జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో బీసీ మ‌హిళ విడ‌ద‌ల ర‌జ‌నీ కోసం సీటు త్యాగం చేసిన పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజశేఖ‌ర్‌కు, మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై గెలిచిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో లోకేష్‌పై ఆళ్ల‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చారు.


వీరిలో ఒక్క బాలినేనినికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ మిగిలిన వారిని ప‌క్క‌న పెట్టేశారు. రాజ‌శేఖ‌ర్‌, ఆళ్ల విష‌యంలో ఓపెన్‌గా హామీ ఇచ్చి మ‌రీ వారిని కేబినెట్‌లోకి ఎందుకు తీసుకోలేద‌న్న ప్ర‌శ్న‌లు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రే కాదు.. కేబినెట్ ఆశ‌ల్లో మునిగి తేలిన ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డ ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత, జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కకపోవడం గమనార్హం. 


ఇక కాపు కోటాలో త‌న‌క‌కు ఖ‌చ్చితంగా చోటు ద‌క్కుతుంద‌ని భావించిన స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు, క‌ర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబం, ప‌శ్చిమ‌గోదావ‌రిలో నాలుగుసార్లు గెలిచిన తెల్లం బాల‌రాజు, జ‌గ‌న్ రైట్ హ్యాండ్ అయిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, క‌డ‌ప‌లోనే వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులకు కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. కొరుముట్ల శ్రీనివాసుల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ముందుగా అంద‌రూ అనుకున్నారు. అయితే చివ‌ర్లో ఆయ‌న్ను కూడా ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌లేదు.


ఇక త‌న కేబినెట్‌లో జ‌గ‌న్ మొత్తం ముగ్గురు మ‌హిళా మంత్రుల‌కు చోటు ఇచ్చారు. వీరిలో కురుపాం నుంచి గెలిచిన ఎస్టీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి గెలిచిన మేక‌తోటి సుచ‌రిత‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వ‌నిత ఉన్నారు. వీరిలో సుచ‌రిత‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కూడా ఖాయ‌మైంది. ఇక తొలి విడ‌త‌లో మంత్రి ప‌ద‌వులు రాని వారు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పిన జ‌గ‌న్ వీరికి రెండో విడ‌త‌లో త‌ప్ప‌కుండా చోటు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో 90 శాతం మందిని మార్చి వారి స్థానాల్లో కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే తాను మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి కూడా అప్పుడే మంత్రి ప‌ద‌వులు రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: