సామాజిక న్యాయం అనే ప‌దం గురించి తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌స్తావించాల‌నుకుంటే ఈ ప‌దానికి నూటికి నూరు శాతం న్యాయం చేసిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికే ద‌క్కుతుంది. సామాజిక న్యాయం అనే ప‌దం తెలుగు రాజ‌కీయాల్లో ఎప్ప‌టి నుంచో ఉంది. చాలా మంది ఈ ప‌దాన్ని ప్ర‌చారంలో వాడుకుని మ‌ర్చిపోయారే త‌ప్ప సామాజిక న్యాయం అన్న‌దానిని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించిన వారు ఎవ్వ‌రూ లేరు. ఈ ప‌దాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు దానిని ప్ర‌చారంలో బాగా పాపుల‌ర్ చేశారు.


అంతే అక్క‌డితో స‌రి.. ప్ర‌చారం వ‌రకే సామాజిక న్యాయం పాటిస్తాన‌ని చెప్పిన చిరంజీవి క‌నీసం టిక్కెట్ల విష‌యంలో కూడా దానిని పూర్తిగా విస్మ‌రించారు. ప్యాకేజీలు ఇచ్చిన వాళ్ల‌కు, అల్లు అర‌వింద్ డ‌బ్బులు తీసుకుని బీ ఫామ్ ఇవ్వ‌మ‌ని చెప్పిన వాళ్ల‌కే ఆయ‌న ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. చిరంజీవి క‌నీసం సామాజిక న్యాయం చేయ‌క పోయినా ఆ ప‌దాన్ని ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. ఇక మిగిలిన ముఖ్య‌మంత్రులు అస‌లు ఈ ప‌దం కూడా ఎక్క‌డా ప‌ల‌క‌ని ప‌రిస్థితి.


ఏడు ద‌శాబ్దాల తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే జ‌గ‌న్ కేబినెట్ కూర్పు చూస్తే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం మెచ్చుకోక త‌ప్పని పరిస్థితి. త‌న కేబినెట్‌లో ఏకంగా ఎనిమిది మంది బీసీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అలాగే ఏకంగా ఐదుగురు ఎస్సీల‌కే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్‌( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్‌ కుమార్‌యాదవ్‌ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ (కురబ)తో పాటు బీసీ ఈ కేట‌గిరికి చెందిన షేక్‌ అంజాద్‌ బాషా (ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.


కేవ‌లం బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు కేబినెట్లో 60 శాతం మంత్రులు ఇవ్వ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. మాదిగ వ‌ర్గం నుంచి తానేటి వ‌నిత‌, ఆదిమూల‌పు సురేష్‌, మాల వ‌ర్గం నుంచి నారాయ‌ణ‌స్వామి, పినిపే విశ్వ‌రూప్‌, మేక‌తోటి సుచ‌రిత‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు క‌ల్పించారు. వీరిలో చాలా మంది మంత్రి ప‌ద‌వుల‌కు కొత్త వారే. యువ‌కులు, ఉన్న‌త విద్యావంతులు కూడా కావ‌డం విశేషం. ఏదేమైనా సామాజిక న్యాయం అనే ప‌దానికి స‌రికొత్త నిర్వ‌చ‌నం ఇవ్వ‌డంతో పాటు.. పూర్తి న్యాయం చేసిన వ్య‌క్తిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తెలుగు రాజ‌కీయాల చ‌రిత్ర‌లో మిగిలిపోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: