మంత్రివర్గం కూర్పులో మొదటి నుండి వినిపించిన పేర్లలో ధర్మాన ప్రసాదరావు ఒకటి. కానీ చివరి నిముషంలో ధర్మాన ప్రసాదరావు బదులు ధర్మాన కృష్ణదాస్ కు చోటు దక్కింది. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ హయాంలో అయినా వైసిపిలో అయినా చక్రం తిప్పింది ధర్మాన సోదరుల్లో  ప్రసాదరావే. అందుకే మంత్రి పదవి కూడా ఎవరికి కావాలో ధర్మాన సోదరుల ఛాయిస్ కే వదిలేశారు జగన్ అని ప్రచారం జరిగింది.

 

కానీ ఆశ్చర్యకరంగా ప్రసాదరావు పేరు వెనకబడిపోయి కృష్ణదాస్ పేరు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. చివరి నిముషంలో ప్రసాదరావు పేరుకు జగన్ ఎందుకు నో చెప్పారు ? అన్న విషయంపై  పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అందుకు పార్టీలోని నేతలు ఓ ఆశక్తికరమైన అంశాన్ని వివరించారు.

 

మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే టిడిపి అభ్యర్ధి కింజరాపు రమ్మోహన్ నాయుడు చేతిలో కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో దువ్వాడకు మెజారిటీ వచ్చిందట. ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రమే మైనస్ వచ్చింది. ఇక్కడ కూడా ధర్మానకు 5700 ఓట్ల మెజారిటి వస్తే అన్నే ఓట్లు దువ్వాడకు మైనస్ అయ్యాయట. అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విషయం అర్ధమైపోతోంది.

 

విషయం ఏమిటంటే దువ్వాడ కాళింగ సామాజికవర్గం నేతట. ధర్మాన, కింజరాపు ఇద్దరూ కొప్పుల వెలమలట. అంటే సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసాదరావు తనకు ఓట్లు వేయించుకుని దువ్వాడను గాలికొదిలేశారని జగన్ కు ఫిర్యాదు అందిందట. అంటే పరోక్షంగా కింజరాపు గెలుపుకు ప్రసాదరావు సహకరించారని పార్టీలో చర్చ జరుగుతోంది. దాంతోనే ఒళ్ళుమండిన జగన్ ప్రసాదరావును మంత్రివర్గానికి దూరంగా పెట్టారన్నది ఓ టాక్ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: