ఫోర్జరీ, ఒప్పందాన్ని ఉల్లంఘించడం, డేటా చౌర్యంతో పాటు, లోగో అక్రమ అమ్మకం సహా పలుకేసుల్లో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ విచారణ కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఆయనను విచారిస్తోన్న పోలీసులు కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులు దాదాపు ఏడు గంటలపాటు రవి ప్రకాశ్‌ను విచారించారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ఈ విచారణలో పాల్గొన్నారు. రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, మోజో టీవీ ఛైర్మన్‌ హరికిరణ్‌ చేరెడ్డిలపై మే 16న ఏబీసీఎల్ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

దీంతో వారిపై ఫోర్జరీ, ఒప్పందాన్ని ఉల్లంఘించడం, సంస్థకు నష్టం వాటిల్లేలా వ్యవహరించడం లాంటి సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రవిప్రకాశ్‌కు, సినీనటుడు శివాజీకి మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలు నిజమైనవేనా? కావాలనే సృష్టించారా? టీవీ9 సంస్థ లోగోను రూ.99 వేలకు విక్రయించినట్లు ఉన్న అగ్రిమెంటులోని నిజాలేంటి? తదితర అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.
Image result for PS Banjara hills and Ravi prakash
మూడు రోజుల పాటు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో  ఫోర్జరీ-మోసం-డేటా చౌర్యంతో పాటు, లోగో అక్రమ అమ్మకానికి సంబంధించి విచారణకు హాజరైన ఆయన శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పలు నేరారోపణలు ఉన్న నేపథ్యంలో పలు ప్రశ్నలు పోలీసులు సంధించినా దేనికి నేరుగా సూటిగా సమాధానం ఇచ్చింది లేదని చెబుతున్నారు. తన సమాధానాలతో పోలీసులకు చుక్కలు చూపించిన రవిప్రకాశ్ కొన్ని సందర్భాల్లో పోలీసులతో ఆయన చేసిన వ్యాఖ్యలకు అవాక్కు అవుతున్నారు.

సైబరాబాద్ పోలీసుల విచారణ జరిపిన మూడు రోజుల్లో ఒక్కటంటే ఒక్క ప్రశ్న కు మాత్రమే నేరుగా సమాధానాన్ని రవిప్రకాశ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోర్జరీ కేసులో సంతకాన్ని తానే ఫోర్జరీ చేసినట్లుగా రవిప్రకాశ్ అంగీకరించినట్లుగా చెబు తున్నారు. ఫోర్జరీ కేసులో సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేసిన విషయాన్ని చెప్పిన ఆయన ఎందుకు ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటేసినట్లుగా తెలుస్తోంది.

తదుపరి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా రవిప్రకాశ్ విచారణ మొత్తాన్ని రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. ఫోర్జరీ కేసులో రవిప్రకాశ్ దస్తూరిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు శనివారం చోటు చేసుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు రవిప్రకాశ్ అరెస్ట్ కు అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: