ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీ ఫుల్ జోష్‌లో ఉంటే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మాత్రం త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొత్త‌దారులు వెతుక్కునే ప‌నిలో బిజీ అవుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీలో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని గ్ర‌హించిన ప‌లువురు నేత‌లు వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వెలువ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న జ‌న‌సేన‌కు అదిరిపోయే షాకులు త‌గులుతున్నాయి.


ఇప్ప‌టికే ప‌వ‌న్ సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా క‌న్వీన‌ర్ వైసీపీ గూటికి చేరిపోయారు. ప‌వ‌న్ తాను పోటీ చేసిన సొంత జిల్లా భీమ‌వ‌రంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక‌లో కూడా ఘోరంగా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పోస్టుమార్టం నిర్వ‌హిస్తోన్న ప‌వ‌న్ ఓట‌మిపై దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామంటూ చెప్పిన రెండో రోజే జ‌న‌సేన‌లో బిగ్ వికెట్ డౌన్ అయ్యింది. 


ఆ పార్టీ కీల‌క నేత‌... ఈ ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు జ‌న‌సేన‌కు శనివారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించినా జ‌న‌సేన‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌నే కార‌ణంతో ఆయ‌న ఇత‌ర పార్టీల వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి టీడీపీలో మంత్రిగా ఉన్న రావెల‌ను బాబు బ‌ల‌వంతంగా తొల‌గించిన‌ప్పుడే ఆయ‌న వైసీపీలోకి రావాల‌ని చూశారు. 


అయితే ఆయ‌న ప్ర‌త్తిపాడు అసెంబ్లీ సీటు కోర‌గా..జ‌గ‌న్ బాప‌ట్ల ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశారు. రావెల చివ‌ర‌కు జ‌న‌సేన‌లోకి వెళ్లి ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు మూడోస్థానంతో స‌రిపెట్టుకున్నారు. రావెల కేవలం 26,371 ఓట్లు సంపాదించుకోగలిగారు. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొంది తాజా కేబినెట్‌లో కూడా చోటు ద‌క్కించుకున్నారు. ఇక జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పిన రావెల బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళుతున్న‌ట్టు టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: