తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లి మెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మొత్తం137 పరీక్షా కేంద్రాల్లో 44,835 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 34,264 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 79,099 హాజరు కానున్నారు. 


ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ఉదయం 8.30 నుంచి మధ్యా హ్నం 12 వరకు, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులను అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.గతంలో లాగా నిమిషం నిబంధన అమలు ఉంది. కాగా పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ ఏర్పాటు చేశారు.


ఇంటర్‌బోర్డు గత కొన్ని రోజులుగా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడంతో కనీసం సప్లిమెంటరీ పరీక్షలనైనా సజావుగా జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా4 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. అవసరాన్నిబట్టి సిట్టింగ్‌ స్వ్కాడ్‌ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించారు. పరీక్షా కేంద్రాల్లోపనిచేసే సిబ్బంది విధిగా గుర్తింపుకార్డులు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.


పరీక్షలు జరగుతున్న సమయంలో కరస్పాండెంట్‌తో సహా ఎవరిని పరీక్షా కేంద్రాల్లో అనుమతించరు. కలెక్టర్‌, ఎస్పీ, ఆర్‌జేడీ, డీఐఈవో, ప్రభుత్వ కళాశాలకు చెందిన సీనియర్‌ ప్రిన్సిపల్‌తో కూడిన ఐదుగురు సభ్యులు గల హైపవర్‌ కమిటీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనుంది. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్‌ తదితర అన్ని మౌలిక వసతులు కల్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: