భీమ‌వ‌రంలో న‌న్ను ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ రాజకీయ సమకాలీన అంశాలపై చర్చించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే ... 


 ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వ‌రాదు.. ఎలాగ‌యినా ఓడించాలి అనేది వారి ల‌క్ష్యం. వీట‌న్నింటినీ నేను ప‌ట్టించుకోను. ప్ర‌జా తీర్పును గౌర‌విద్దాం. వైసీపీ పాల‌న ఎలా వుంటుందో చూద్దాం. రెండు రోజుల క్రితం నేను ఎయిర్‌పోర్టు నుంచి వ‌స్తుంటే రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు ప్ల‌కార్డుల‌తో రోడ్ల మీద‌కి వ‌చ్చారు. ప్ర‌స్తుతం మ‌న ముందు ఉన్న ల‌క్ష్యం ఒక్క‌టే. ఎక్క‌డ ఆక‌లి ఉంటుందో, ఎక్క‌డ స‌మ‌స్య ఉంటుందో అక్క‌డ జ‌న‌సేన గుర్తు క‌న‌ప‌డాలి. అక్కడి ప్రజలకు మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి.


కుయుక్తుల‌తో కూడిన రాజ‌కీయాలు నేను చేయ‌ను. స‌మీక్ష‌కి వ‌చ్చిన ప్ర‌తి అభ్య‌ర్ధిని అడుగుతున్నా మీరు ఉంటారా, వెళ్లిపోతారా అని. మేము మీ వెంటే ఉన్నాం అని చెప్ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చాం అంటున్నారు. ఇంత‌కు మించిన విజ‌యం ఏం కావాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం బ‌య‌టప‌డుతుంది. ఓట‌మి ఎదురైన‌ప్పుడే నువ్వు నావాడివా ప‌రాయివాడివా అన్న విష‌యం అర్ధం అవుతుంది. మీరంతా నా కోసం వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.

నేను మ‌ళ్లీ చెబుతున్నా ఏదో ఒక ఎన్నిక‌ల కోసం వ‌చ్చి వెళ్లిపోవ‌డానికి పార్టీ పెట్టలేదు. క‌ష్ట‌మైన ప్ర‌యాణం అని తెలిసీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఓట‌మికి కుంగిపోను దెబ్బ‌తినే కొద్ది ముందుకు వెళ్తూనే ఉంటా. ఈ ఆఫీస్ మనది. ఎవ‌రైనా ఎపుడైనా రావ‌చ్చు. అంద‌రికీ అందుబాటులో ఉంటా. అంద‌ర్నీ క‌లిసేందుకు ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయిస్తాను” అని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: