తెలంగాణ కాంగ్రెస్ ను టీఆర్ఎస్ హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డంతో సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అనే ప‌దం విన‌ప‌డ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో ఎన్ని చేయాల్నో అన్ని చేసిన టీఆర్ఎస్.. ఆఖ‌రికి కాంగ్రెస్ పార్టీని కూడా చావు దెబ్బ తీసింది. ఏకంగా సీఎల్పీని సైతం టీఆర్ఎస్ లో విలీనం చేసుకుని తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించింది.టీఆర్ఎస్ కొట్టిన దెబ్బ‌కు ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా ఏర్ప‌డింది.అస‌లు ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా తెలంగాణ శాస‌న‌స‌భ‌లో నిలుస్తుంద‌ని బ‌హుశా అస‌దుద్దీన్ ఓవైసీ కూడా క‌ల‌క‌ని ఉండ‌రు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు చాలా బుద్ధిమంతులు..ఎందుకంటే వాళ్లు గెలిచేది ఏడుగురే అయినా చివ‌రిదాకా గెలిచిన పార్టీకి అంటిపెట్టుకుని ఉంటారు. టీడీపీ,కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగా అమ్ముడుబోరు. వంద ఏళ్లైనా తెలంగాణ‌లో ఎంఐఎం అధికారంలోకి రాద‌ని వాళ్లకు తెలుసు.. అయినా అదే పార్టీలో ఉంటూ..వాళ్ల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు తీర్చేందుకు పోరాడుతారు త‌ప్పా,అధికార దాహం కోసం ప్ర‌య‌త్నించ‌రు..


ఇకపోతే  కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు. హ‌స్తం గుర్తుపై 19మంది గెలిస్తే వారిలో 12 మందిని కారెక్కించ‌గ‌లిగాడంటే కేసీఆర్ మామూలోడు కాదు. మొత్తానికి అనుకున్న‌ది సాధించిన కేసీఆర్..ఇక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.


కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారిలో ఇద్ద‌రిని త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌న్న దానిపై పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. పార్టీలో చేరిన స‌మ‌యంలో స‌బితా ఇంద్రారెడ్డికి ఇచ్చిన హామీ మేర‌కు ఆమె పేరు ఖాయంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఆమె గులాబీ తీర్థం పుచ్చుకునే వేళ‌.. త‌న‌యుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ తో పాటు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని కోరార‌ట‌. కానీ, కేసీఆర్ మాత్రం చేవెళ్ల పార్ల‌మెంట్ టికెట్ ను ఇవ్వ‌లేమ‌ని, మీకు ఉన్న‌త‌మైన శాఖ‌ను క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని హామీ ఇచ్చార‌ట‌.


ఇప్పుడా హామీ మేర‌కు స‌బితా రెడ్డి పేరును క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోది. అయితే.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌లువురిని తొల‌గించ‌డంతో పాటు,ఉన్న‌వారిలో కూడా శాఖ‌ల మార్పు ఉండ‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అదే జ‌రిగితే.. హోంమంత్రిగా ఉన్న మ‌హ్మ‌ద్ అలీని కూడా వేరే శాఖ‌కు బ‌దిలీ చేస్తార‌ని తెలుస్తోంది. ఆయ‌న‌కు గ‌త ప్ర‌భుత్వంలో ఇచ్చిన‌టువంటి రెవెన్యూ మినిస్ట్రీ ఇవ్వ‌చ్చ‌ని టాక్ న‌డుస్తోంది. ఇక మ‌హిళ‌ల‌కు కేసీఆర్ క్యాబినెట్లో ప్రాతినిథ్యం లేద‌న్న అప‌వాదును మోస్తున్న కేసీఆర్.. స‌బితా ఇంద్రారెడ్డికి హోం శాఖ ఇచ్చి ఆ అప‌వాదును తొల‌గించుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది. స‌బితారెడ్డితో పాటు మ‌రో మ‌హిళా ఎమ్మెల్యేకు కూడా కేసీఆర్ టీంలో చోటు ల‌భించ‌నుంద‌ని స‌మాచారం. క‌ల్వకుంట్ల క‌విత‌కు కూడా క్యాబినెట్లో చోటు ల‌భిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నా..అవ‌న్నీ ఊహాగానాలేన‌ని ఆమెకు ఈసారికి అవ‌కాశం క‌ల్పించ‌క‌పోవ‌చ్చున‌ని పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: