ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కేబినెట్ కూర్పు ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా భిన్నంగా ఉంది. ఆ పార్టీ నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. దీంతో కేబినెట్ ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. కేబినెట్‌లో జ‌గ‌న్ కాకుండా మ‌రో 25 మందికే ఛాన్స్ ఉంది. దీంతో కేబినెట్ కూర్పు జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్‌గా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. జ‌గ‌న్ మాత్రం చాలా చాక‌చ‌క్యంగా అన్ని వ‌ర్గాల‌కు కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తూ చాలా మంది సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్ట‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది.


ఇక తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన‌ట్టుగానే ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు కేబినెట్‌లో ఏకంగా 60 శాతం బెర్తులు కేటాయించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని అనుకున్న వారిలో స‌హ‌జంగానే కొంద‌రికి ప‌ద‌వులు రాలేదు. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. రోజా, భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి లాంటి వాళ్లు ఇప్ప‌టికే త‌మ అసంతృప్తిని ఇంట‌ర్న‌ల్‌గానో లేదా ఏదో రూపాల్లో వ్య‌క్తం చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్న వారిలో ఓ సీనియ‌ర్ నేత‌కు అనూహ్యంగా చివ‌ర్లో కేబినెట్ బెర్త్ ల‌క్ చిక్క‌లేదు. ఆయ‌నే విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక‌ల రాజ‌న్న‌దొర‌. గ‌తంలో వైఎస్ అన‌చ‌రుడిగా ఉండి ఆయ‌న ప్రాప‌కంతో సీటు ద‌క్కించుకున్న రాజ‌న్న‌దొర కోర్టు తీర్పుతో 2007లో ఎమ్మెల్యేగా సాలూరు నుంచి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి రెండోసారి గెలిచిన ఆయ‌న‌, వైసీపీ నుంచి 2014తో పాటు తాజా ఎన్నిక‌ల్లోనూ గెలిచారు. ఓట‌మి లేకుండా వ‌రుస‌గా నాలుగు సార్లు గెల‌వ‌డంతో పాటు జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న వెంటే ఉండ‌డం, ఎస్టీల్లో సీనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.


త‌మ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని భావించిన రాజ‌న్న దొర అనుచ‌రులు సాలూరు నుంచి కార్ల‌లో అమ‌రావ‌తికి కూడా బ‌య‌లు దేరారు. అయితే చివ‌ర్లో ఎస్టీ కోటాలో రాజ‌న్న‌దొర‌కు కాకుండా ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం అయిన కురుపాం నుంచి గెలిచిన పాముల పుష్ప‌శ్రీ వాణికి మంత్రి ప‌ద‌వితో పాటు ఏకంగా డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా ద‌క్కింది. ఆమెకు ఆ ప‌ద‌వి రాక‌పోతే ఖ‌చ్చితంగా రాజ‌న్నదొర‌కే మంత్రి ప‌ద‌వి డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌చ్చేవి.


వైసీపీ ఆవిర్భావం నుంచి రాజన్నదొర ఆ పార్టీలో ఉన్నారు. ఐతే, మొదట బొత్సకు తనకు మధ్య సఖ్యత బాగున్నా, తర్వాత అనేక కారణాలతో ఇద్దరి మధ్య దూరం కొంచెం పెరిగిందని, అందువల్లే రాజన్నదొరకు కేబినెట్‌లో చోటు లభించకపోవటానికి ఇదొక కారణమని... రాజ‌న్న దొర‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే  రాజ‌కీయంగా ఆయ‌న రెండో ప‌వ‌ర్ సెంట‌ర్‌గా జిల్లాలో మార‌తార‌ని భావించిన బొత్స ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా తెర‌వెన‌క చ‌క్రం తిప్పార‌ని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: