ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విప‌క్ష టీడీపీలో పెను సంక్షోభం త‌లెత్త‌నుందా ? ఆ పార్టీలో పెద్ద ఉప‌ద్ర‌వం త‌ప్ప‌దా ? అంటే తాజాగా ఆ పార్టీ వ‌ర్గాల నుంచి వెలువడుతోన్న సంకేతాల‌ను బ‌ట్టి చూస్తే అవుననే ఆన్స‌ర్లు వినిపిస్తున్నాయి. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ ఎన్నిక‌ల్లోనే ఆ పార్టీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. టీడీపీ ఎప్పుడూ లేనంత‌గా కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఆ పార్టీకి కేవ‌లం ముగ్గురు ఎంపీలు మాత్ర‌మే లోక్‌స‌భ‌లో ఉన్నారు. 


ఓ వైపు న‌వ‌యువ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో పాల‌న‌లో దూసుకుపోతున్నారు. జ‌గ‌న్ కేబినెట్ కూర్పు కూడా త‌ల‌పండిన రాజ‌కీయ మేథావుల‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయేలా ఉంది. ఇక మూలిగేన‌క్క మీద తాటిపండు ప‌డిన చందంగా అస‌లే అవ‌సాన ద‌శ‌లో ఉన్న టీడీపీ లీడ‌ర్లు ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే టార్గెట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్ల త‌న ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీలో టీడీపీని టార్గెట్‌గా చేసుకుని పావులు క‌దుపుతోంది.


ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిన ప‌లువురు టీడీపీ సీనియ‌ర్లు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి కొమ్ముకాసే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లే ఇప్పుడు బీజేపీ వైపు ఆక‌ర్షితులు అవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ వ‌ర్గ నేత‌లు పెద్ద ఎత్తున బీజేపీలో చేర‌నున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయ‌క‌త్వం సైతం ముందుగా టీడీపీలో ఒక‌రిద్ద‌రు ఎంపీల‌ను టార్గెట్‌గా చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేశినేని నాని బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉండ‌డం కూడా పెద్ద అనుమానాల‌కు తావిచ్చేలా ఉంది. 


ఇదిలా ఉంటే ఏపీలో సీబీఐ ఎంట్రీకి జ‌గ‌న్ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డాన్ని బ‌ట్టి చూస్తే కూడా టీడీపీలో కొంద‌రు కీల‌క నేత‌ల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే సీబీఐ సోదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి. మ‌రికొంద‌రు నేత‌ల‌పై కూడా సీబీఐ ఎటాక్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల టైంలోనే కేంద్రం ఇన్‌కంట్యాక్స్ దాడుల‌తో ఆ పార్టీ నేత‌ల‌కు చుక్క‌లు చూపించింది. ఇప్పుడు ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి ఉంది. ఇప్పుడు మ‌రింత భీక‌ర‌మైన దాడులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. 


ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు దృష్టే సీబీఐ  చేతుల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు పార్టీ నేత‌లు టీడీపీ భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేక వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ కూడా మ‌రికొంద‌రిని లాక్కునే ప్లానింగ్‌లో ఉంది. ఏదేమైనా టీడీపీలో త్వ‌ర‌లోనే పెద్ద సంక్షోభం త‌ప్పేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: