ఆదివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమలకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  వినతిపత్రం ద్వారా మోదీని కోరనున్నారు.

ఏపీకి రావాల్సిన నిధులు
2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని జగన్‌ కోరనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 నెలల రెవెన్యూలోటు రూ.16,078 కోట్లు కాగా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు వచ్చాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రూ.6,870 కోట్ల ఖర్చును ఆ ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో చూపలేకపోయారు. ఇవి రెండూ కలిపితే రెవెన్యూలోటు రూ.22,948 కోట్లకు చేరుకుంటుంది. 2014-15 ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో రూ.16,078 కోట్లలో రూ.4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో రూ.3979 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.138.39 కోట్లు రావాల్సి ఉంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రెవెన్యూలోటులో చేర్చని రూ.6870 కోట్లలో పీఆర్సీ ఎరియర్స్‌ రూ.3,920 కోట్లు, బిల్లులు రూ.2,950 కోట్లు ఉన్నాయి. మొత్తం రెవెన్యూలోటు రూ.22,948 కోట్లలో ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది.

విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్‌ 50, సెక్షన్‌ 51లను సవరిస్తే ఏపీకి అదనంగా రూ.3,820 కోట్లు వస్తాయని, ఈ సెక్షన్లను సవరించి ఏపీకి న్యాయం చేయాలని వినతిపత్రం ద్వారా జగన్‌ కోరనున్నారు. ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ.350 కోట్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది రూ.350 కోట్లను ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్నారు. ఐదో ఏడాది అసలు ఇవ్వలేదు.

నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతిఆయోగ్‌ కూడా కోరినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ ఆ నిధులు విడుదల చేయలేదు. వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరనున్నారు. అలాగే, ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఇవ్వాలని, ఇందుకుగాను రూ.23,300 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: