రాజ‌కీయాల్లో ప‌రిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఏ పార్టీ ప‌రిస్థితి ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొం టుందో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే గ‌త అధికార పార్టీ టీడీపీ ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో రెండో సారి కూడా గెలిచి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకుని, ఎన్నో విదాల ప్ర‌య‌త్నం చేసినా.. టీడీపీకి ప‌రిస్థితి అనుకూలించ‌లేదు. దీంతో ఎన్నిక‌ల్లో గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట‌మి కూడా కాకుండా చిత్తు చిత్తుగా ఓట‌మి పాలైంది. ఇక‌, ఈ ఓట‌మి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పార్టీ అధినేత నుంచి శ్రేణుల వ‌ర‌కు కూడా ఎవ‌రూ జీర్ణించుకోలేని ప‌రిస్థితిలోనే ఉన్నారు. 


అయితే, ఇంత‌లోనే టీడీపీకి గోరు చుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా బ‌ల‌మైన దెబ్బ త‌గిలింది. పార్టీకి కేరాఫ్‌గా మారిన ప‌శ్చి మ గోదావ‌రి జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ 15 అసెంబ్లీ, రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను త‌న ఖాతాలోనే వేసుకున్న టీడీపీ.. తాజా ఎన్నిక‌ల్లో త‌న అడ్ర‌స్‌ను కోల్పోయింది. దీంతో పార్టీ శ్రేణులు డీలా ప‌డ్డాయి. అదేస‌మ‌యంలో కీల‌క నాయ‌కులు కూడా ఇప్పటి వ‌ర‌కు రోడ్ల మీద‌కు వ‌చ్చింది లేదు. దీనికితోడు అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ రోజు రోజుకు నూత‌న వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. 


ఇప్ప‌టికే పాల‌న‌పై త‌న‌దైన ముద్ర వేశారు వైసీపీ అదినేత , సీఎం జ‌గ‌న్‌. దీంతో ఇక‌, వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి రాద‌ని గ్ర‌హించిన త‌మ్ముళ్లు, శ్రేణులు పార్టీ మారుడే బెట‌ర్ అని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పార్టీ మారి.. జెండా మార్చుకున్నారు. తణుకు టీడీపీ కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 


వారి బాటలోనే.. మరో పదిహేను మంది కౌన్సిలర్లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పార్టీలో చేరేవారు తమ కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందిగా కారుమూరి కోరారు. రాష్ట్రంలో వైసీపీ బ‌లంగా ఉండ‌డం, మ‌రోప‌క్క‌, బీజేపీ బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో ఇక టీడీపీలో ఉండి లాభం లేద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: