అవును శాసనసభాపక్ష సమావేశంలో చెప్పినట్లే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు పోతున్నారు.  సమాజంలో మెజారిటీ వార్గాలను, ప్రభావితం చేయగలిగిన వర్గాలను టార్గెట్ చేసుకుని సంక్షే పథకాలు అమలు చేయబోతున్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులకు జగన్ పెద్ద పీట వేయాలని డిసైడ్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పై మూడు వర్గాలు వైసిపిని బాగా ఆదరించ బట్టే వైసిపికి అఖండ మెజారిటీ వచ్చింది.

 

పంటలకు మద్దతు ధర,  వ్యవసాయోత్పుత్తులకు గిట్టుబాటు ధరలకోసం ధరల స్ధిరీకరణ నిధి, విత్తనాలు తదితరాలను సకాలంలో నాణ్యమైనవి అందించేదుకు రంగం రెడీ చేస్తున్నారు. ధరల స్ధిరీకరణ నిధితో పాటు రైతు భరోసా తదితరాలు అక్టోబర్ 15వ తేదీ నుండి అమలు చేయబోతున్నారు.

 

ఇక మహిళలంటారా మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఏ స్ధాయిలో ఆదరించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకనే దాదాపు 42 వేలమంది ఆశా వర్కర్ల వేతనాలను ఒక్కసారిగా రూ . 3 వేల నుండి రూ 10 వేలకు పెంచేశారు. అదే సమయంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.  ఈ మేరకు డిజిపి గౌతమ్ సవాంగ్ కు కచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఇవి కాకుండా అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకే పెద్ద పీట వేయబోతున్నారు.

 

ఇక, ఉద్యోగులు, నిరుద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందుగా ఉద్యోగులకు 27 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటించేశారు. సిఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఉద్యోగుల ప్రమోషన్లు, ఫైళ్ళు పూర్తి చేయటానికి టార్గెట్లు ఫిక్స్ చేయటాలు తదితర విషయాల్లో కచ్చితత్వాన్ని పాటిస్తున్నారు. దీర్ఘకాలిక డిమాండ్ అయిన (పెన్షన్) సిపిఎస్ రద్దు చేయనున్నట్లు ప్రకటించేశారు.

 

అలాగే, 5 లక్షలమంది గ్రామ వాలంటీర్లను నియమించనున్నారు.  గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా స్దానిక యువత, నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఫలితంగా చంద్రబాబునాయుడు హయాంలో మొదలైన నిరుద్యోగ భృతి ఉండకపోవచ్చు. ప్రభుత్వ పరంగా జగన్ తీసుకుంటున్న చర్యలన్నీ వచ్చే ఎన్నికల్లో వైసిపికి పటిష్టమైన ఓటు బ్యాంకును ఇప్పటి నుండే రెడీ చేసుకుంటున్నట్లే కనబడుతోంది. అంటే సంక్షేమానికి సంక్షేమం పార్టీ పటిష్టానికి చర్యలు మొత్తానికి అదిరిందిగా జగన్ స్కెచ్.


మరింత సమాచారం తెలుసుకోండి: