టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓట‌మి అవ‌మానం కంటే..పార్టీలోని లుక‌లుక‌లే ప‌రువు తీసే విధంగా మారిపోయాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తీరు ఆయ‌న్ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయవాడ ఎంపీగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యులు కేశినేని నానికి ఆ పార్టీ నేతలతో పొసగడంలేదు. లోక్‌సభలో పార్టీ విప్‌గా చంద్ర‌బాబు నియమిస్తే..  తిరస్కరించిన సంగతి తెలిసిందే.. అదే సందర్భంలో 'పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్ళు తప్ప' అనే పోస్ట్ పెట్టి తీవ్రమైన చర్చకు కేశినేని నాని దారితీశారు . 


కేశిశేని నాని అక్క‌డితో ఆగిపోలేదు, ఇవాళ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ఈ సారి నేరుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేశారు .. "కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!'' అంటూ హాట్ పోస్ట్ పెట్టారు. ఓవైపు దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూనే... మరోవైపు కొడాలి నానిపై సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ పోస్ట్.. ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. టీడీపీ నేత దేవినేనికి కృతజ్ఞుడిగా ఉండడం ఏంటి? అని చెవులు కొరుకుంటున్నారు.  ఇంత‌కీ కేశినేని నాని టార్గెట్ ఎవ‌రు? చ‌ంద్ర‌బాబా?  పార్టీ నేత‌ల‌? పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌లో కేశినేని నాని ఉన్నార‌నే దాంట్లో నిజ‌మెంతా? ఈ ఎదురుదాడి వెనుక లెక్క‌లేంటి? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే రాజ‌కీయ వ‌ర్గాల్లో తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఈ పోస్ట్‌పై దేవినేని ఉమా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


అయితే, కేశినేని నాని ఇవాళ ఫేస్‌బుక్ పోస్టుల లెక్కేంటో అర్థం కావ‌డం లేదంటున్నారు. ''పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్ళు తప్ప...'' అంటూ శ్రీశ్రీ కవిత్వంలోని వ్యాఖ్యలను పోస్టు చేశారు. మరి కేశినేని పోరాటం ఎవరిపైనా..? టీడీపీ నాయకత్వంపైనా? కృష్ణా జిల్లా నేతలపైనా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు ఆయన పార్టీ మారతారనే దానిపై క్లారిటీ రాకపోయినా..! టీడీపీలో జరుగుతోన్న పరిణామాలపై మాత్రం కేశినేని నాని సంతృప్తిగా లేరనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయట‌కు వెళ్లడం ఖాయమనే చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: