విజయవాడ టిడిపి ఎంపి కేశినేని తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు ద్వారా టిడిపిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నానికి చోటు దక్కిన విషయం తెలిసిందే.

 

ఆ విషయాన్నే కేశినేని ప్రస్తావిస్తు మంత్రి కొడాలి నాని టిడిపి మాజీ మంత్రి దేవినేనికి రుణపడి ఉండాలంటూ పెట్టిన  పోస్టు సంచలనంగా మారింది. కొడాలి వైసిపి తరపున గుడివాడలో సుమారుగా 19 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. టిడిపి తరపున పోటి చేసింది దేవినేని అవినాష్. గుడివాగలో దేవినేని అవినాష్ పై కొడాలి గెలిచినందుకు మాజీ మంత్రి దేవినేని ఉమ కు ఎందుకు రుణపడి ఉండాలో మాత్రం కేశినేని చెప్పలేదు.

 

దేవినేని-కేశినేని మధ్య ఎప్పటి నుండో గొడవలున్నాయి. వారిద్దరికీ చాలా కాలంగా  పడటం లేదు. ఇపుడు కేశినేని చేస్తున్న రచ్చంతా దేవినేని ఉమ గురించే అన్న విషయం అందిరికీ తెలిసిందే. కేశినేని తాజా పోస్టులు చూస్తుంటే గుడివాడలో అవినాష్ ఓటమికి మాజీ మంత్రి దేవినేనే కారణమనే అనుమానాలు మొదలయ్యాయి.

 

నిజానికి మైలవరంలో దేవినేని ఉమ కూడా ఓడిపోయారు. మంత్రయిన తర్వాత దేవినేని వైఖరి వల్లే జిల్లాలో చాలా చోట్ల టిడిపి పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనే ఆరోపణలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఉమ అంటే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీకి కూడా పడదు. చాలామంది ఎంఎల్ఏలతో ఉమకు పడటం లేదు. ఉమ వైఖరి వల్లే గుడివాడలోని టిడిపి నేతలు కూడా అవినాష్ ఓటమికి కృషి చేశారా అనే అనుమానాలు కూడా కేశినేని తాజా పోస్టుపై చర్చ మొదలైంది. అంటే అవినాష్ ఓటమికి దేవినేని ఉమ రెండు రకాలుగా కారణమయ్యారనే చర్చ అయితే పార్టీలో మొదలైంది. ఏదేమైనా కేశినేని వ్యాఖ్యలు, పోస్టులు చంద్రబాబునాయుడుకు మాత్రం తీరని తలనొప్పులు తెస్తున్నది వాస్తవం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: