తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. ఏపీ విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకి ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తున్నారు. త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రానున్నారని సమాచారం.  ఇవాళ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని సమాచారం.


ఐతే ఎన్డీయే బంపర్ మెజారిటీతో గెలవడం, కేంద్రంలో మరోసారి మోదీ చక్రం తిప్పడం జరిగిపోయింది.  కొన్ని వ్యక్తిగత కారణాలు గానీ, మరే కారణమైనా గానీ... ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉండిపోయారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. గత ఐదేళ్ల మోదీ పాలనలో తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. అమెరికాతో సంబంధాలు, గల్ఫ్‌లో భారతీయులకు రక్షణ అంశాలు, ఐక్యరాజ్యసమితిలో భారత వాణి వినిపించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు సుష్మాస్వరాజ్. 


ఇక రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు తగిన గుర్తింపు ఉండేలా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా సెట్ అవుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్ల వినయ విదేయతగానే ఉంది.


కానీ భవిష్యత్ లో నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లే అవకాశం ఉందనీ, అలాంటి సమయంలో... ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు ప్రత్యేకంగా గవర్నర్ ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఓ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇక్కడ తీసుకువస్తే బాగుంటుందని బీజేపీ యోచన. అన్నీ అనుకున్నట్లే జరిగితే... త్వరలోనే సుష్మస్వరాజ్ ఏపీలో గవర్నర్‌గా అడుగుపెట్టే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: