తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో ఏనాడు లేని విధంగా ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర పరాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఏపీ రికార్డుల్లో లేని మెజార్టీతో వైసీపీని ఏపీ ప్ర‌జ‌లు గెలిపించారు. అయితే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ గెలుపును మ‌రో ర‌కంగా విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు, ఓటమి కారణాలపై పార్టీ నేతలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ సమీక్షించారు. అయితే, ఈ స‌మీక్ష‌లో కూడా...ఆత్మ స్తుతి ప‌ర‌నింద అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. 
1989, 2004 ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, కానీ ఈసారి ప్రభుత్వ వ్యవహారాలు, సంక్షేమం విషయాల్లో అసంతృప్తి కనపడలేదని తెలుగుదేశం శ్రేణులు విశ్లేషించ‌డం గ‌మ‌నార్హం. 'ఒక్కసారి జగన్‌కు అవకాశం' స్లోగన్,  సామాజిక సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బలంగా పనిచేశాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.అయితే, ఓట‌మి ఖరారు అయిపోయిన నేప‌థ్యంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా అభివృద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమంలో ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని ఈ సందర్భంగా బాబు తెలిపారు.
మ‌రోవైపు జ‌గ‌న్ పాల‌న‌పై స‌హ‌జంగానే టీడీపీ నేత‌లు అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వ విధానం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని, తమ హయాంలో ప్రారంభమైన పనులను పక్కన పెట్టేందుకే కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుందని నేత‌లు ఆరోపించారు. గత ప్రభుత్వానికి ఇరిగేషన్ క్రెడిట్ దక్కకూడదనే వ్యూహంతోపాటు తన సొంత పథకాల కోసం గత ప్రభుత్వం మొదలు పెట్టిన స్కీమ్‌లను నిలిపివేసి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పథకాలకు పేరు మార్పు తప్పుకాదని, పథకాలు తీసేయడం సరికాదు అని భేటీలో నేతలు వ్యాఖ్యానించారు. ఇక.. టీడీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో నేతలు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: