ఆ పని గనుక జగన్మోహన్ రెడ్డి చేస్తే నిజంగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. ఇంతకీ అదేమిటో తెలిసిందే. అదే ఆర్టీసిని ప్రభుత్వం విలీనం చేయటం. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని దశాబ్దాలుగా డిమాండ్లు వినబడుతునే ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ జగన్ మాత్రం తాను ముఖ్యమంత్రి అయితే విలీనం చేస్తానంటూ హామీఇచ్చారు.

 

అనుకున్నట్లే జగన్ అధికారంలోకి వచ్చారు. వెంటనే ఆర్టీసిని ప్రభుత్వంలోకి విలీనం చేసే విషయంలో కసరత్తు ప్రారంభించేశారు. క్యాబినెట్లో నిర్ణయం తీసేసుకుంటే మిగిలినదంతా లాంఛనమే అవుతుంది. సోమవారం క్యాబినెట్లో విలీనానికి నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్వయంగా జగనే సంకేతాలు పంపారు.

 

ఆ నిర్ణయం కోసమే కొన్ని వేలమంది కార్మికులు, వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఆర్టీసిని విలీనం చేస్తే ఇటు సంస్ధకు అటు ప్రభుత్వానికి కొన్ని లాభాలున్నాయి. అందుకనే కార్మికులు విలీనం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.

 

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే ముందుగా  కార్మికులకు ఉద్యోగభద్రత దొరుకుతుంది. ఫిట్మెంట్ కోసం ప్రతీ యేడాది చేస్తున్నట్లుగా సమ్మెలు చేయాల్సిన అవసరం ఉండదు. సంస్ధకి కొత్త బస్సులు కొనటానికి రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రభుత్వమే బడ్జెట్ కేటాయిస్తుంది కాబట్టి.

 

లాభ నష్టాల ప్రాతిపదికన కాకుండా జనాల అభిమానం సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న అన్నీ రూట్లలో బస్సులు వేస్తారు కాబట్టి జనాలకు బస్సులు అందుబాటులోకి వస్తాయి. డీజల్ ధరల పెరుగుదలతో సంబంధం లేకుండానే వివిధ వర్గాలకు రాయితీలు అందించే అవకాశం ఉంటుంది.

 

లాభనష్టాలతో సంస్ధకు ఎటువంటి సంబంధం ఉండదు. నష్టాలు వచ్చినపుడు ప్రభుత్వం భరించినట్లే లాభాలు వచ్చినా ప్రభుత్వమే తీసుకుంటుంది. దీనివల్ల ఆర్టీసి నష్టాలు తీరిపోతాయి. ప్రస్తుతం ఆర్టీసి బస్టాండులు, గ్యారేజిలు, డిపోలు, కాంప్లెక్సులు, ఆర్టీసీ పేరుతో ఉన్న కోట్లది రూపాయల విలువైన ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైపోతాయి. ఈ విషయాలను అధ్యయనం చేసిన తర్వాతే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: