అగ్రిగోల్డ్...ఈ సంస్ధ గురించి, సంస్ధ బాధితుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 6 రాష్ట్రాల్లో 39 లక్షల మంది ఖాతాదారులు (బాధితులు)న్నారు. సంస్ధలో చందాదారులుగా చేరి లక్షల్లో నష్టపోయిన బాధితుల సంఖ్యే లక్షల్లో ఉంది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోనే సుమారుగా 19 లక్షల మంది బాధితులున్నారు. అలాంటి బాధితుల్లో కొందరికి ఊరట కలిగేట్లుగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది.

 

20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు  ప్రభుత్వమే కోర్టులో రూ. 1150 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయం వల్ల సుమారు 9 లక్షల మంది తక్షణం ఇబ్బందుల్లో నుండి బయటపడతారు. నిజానికి ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్దితో ఆలోచించలేదు. పైగా సంస్ధకున్న వేల కోట్ల రూపాయల ఆస్తులను అడ్డదారుల్లో కొట్టేయటానికి నానా పాట్లు పడింది.

 

సమస్యను పరిష్కరించి బాధితులను ఆదుకోవాల్సిన చంద్రబాబు మరింత జటిలం చేశారు. దాంతో ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేరన్న ఉద్దేశ్యంతోనే కొందరు బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి నేపధ్యంలో జగన్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. అందుకనే 20 వేల రూపాయల లోపు పెట్టుబడి పెట్టిన బాధితుల కోసం ముందు ప్రభుత్వమే 1150 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు.

 

నిజానికి ఇదే నిర్ణయం చంద్రబాబు కూడా చేసుండొచ్చు. కానీ బాధితులను ఆదుకునేంత మనసు చంద్రబాబుకు లేదు. పైగా వేలం పాటలని అదని ఇదని పుణ్యకాలమంతా గడిపేశారు. అందుకనే కడుపుమండిన బాధితుల్లో అత్యధికులు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఒక చిన్న పరిష్కారంతో 9 లక్షల మంది బాధితులకు ఊరట కలుగుతుందన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేకపోయింది.

 

ఎంతసేపు సంస్ధ ఆస్తులను ఏ విధంగా కారుచౌకగా కొట్టేద్దామా ? తన వాళ్ళతో ఆస్తులను ఎలా కొనిపించాలి ? అన్న ఆలోచన తప్ప సమస్య పరిష్కారం దిశగా ఏనాడూ ప్రయత్నించ లేదు. అందుకనే సమస్య మరింత జటిలమైపోయింది. మొత్తానికి సమస్య పరిష్కారం దిశగా జగన్ వేసిన తొలి అడుగుతో తొందరలోనే ఆగ్రిగోల్డ్ బాధితులందరికీ ఊరట లభిస్తుందనే అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: