ప్రభుత్వంలో ఏపీయస్ ఆర్టీసీ విలీనం చేసేందుకు సీఎం జగన్ కమిటీ వేయడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇవాళ మరోసారి  జేఏసీ నేతలు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో భేటీ అయ్యారు.  ప్రస్తుతం ఆర్టీసీ హౌస్‌లో చర్చలు కొనసాగుతున్నాయి.

నిన్న అర్థరాత్రి వరకు కూడా సురేంద్రబాబుతో జరిగిన చర్చలు పరిష్కారం దిశగా సాగాయి. 90 శాతం సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. హామీల అమలు కోసం ఎంవోయు ఇచ్చేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీని జేఏసీ నేతలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె విరమణ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.

సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మె పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం చర్చలు ముగిసిన  తర్వాత ఆర్టీసీ హౌస్ నుండి ఎండీ, జేఏసీ నేతలు కలిసి సీఎం జగన్‌ను కలుస్తారు.  సమ్మెపై నిర్ణయాన్ని సీఎం సమక్షంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించనున్నారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: