తెలంగాణలో ఆ మద్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టి కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలతో కలిసి ‘మహాకూటమి’గా ఏర్పడ్డాయి.  టీఆర్ఎస్ ని చిత్తుగా ఓడించాలని మహాకూటమి తరుపు నుంచి రాహూల్ గాంధీ, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెగ ప్రచారాలు చేశారు.  కానీ ఎన్నికల ఫలితాల్లో ఖంగు తిన్నారు..తెలంగాణ  ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.  రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు చిత్ర విచిత్రంగా కొనసాగాయి. 


అప్పటి వరకు కాంగ్రెస్ కి పరమ విధేయులు గా ఉన్న పెద్ద నాయకులు సైతం టీఆర్ఎస్ లోకి జంప్ కావడం మొదలు పెట్టారు.  ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని..ఆ పార్టీలో ఉంటేనే రాష్ట్రాభివృద్ది సాగుతుందని వారి వాదన. ఇలా వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి వలస రావడంతో టీ కాంగ్రెస్ కి మింగుడపడకుండా ఉంది.  అంతే కాదు వీరంతా ఒక అడుగు ముందుకు వేసీ సీఎల్పీని టీఆర్ఎస్ లోకి విలీనం చేయాలని నిర్చయించుకున్నారు.  అయితే దీనిపై పెద్ద ఎత్తున టీకాంగ్రెస్ నేతలు గొడవలు చేశారు.


కాగా,  సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం వ్యవహారంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. 


అంతే కాదు కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలిచి ఎలాంటి నోటీసులు కానీ, సంప్రదింపులు కానీ చేయకుండా పార్టీని విమర్శిస్తూ వెళ్లే వారికి నైతిక విలువలు లేవని టి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. 


ఒకవేళ విలీనం చేయాలంటే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినా స్పందించలేదని ఉత్తమ్‌, భట్టి పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, సురేందర్‌, చిరుమర్తి లింగయ్య, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డిలతో పాటు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: