"అమ్మ ఒడి" పథకంలో భాగంగా, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు కూడా సంవత్సరానికి ₹12,000/ ₹15,000 ఇవ్వడం అనేది పరోక్షంగా ప్రైవేట్ స్కూల్స్ ను ప్రభుత్వం ప్రోత్సహించినట్టే. విధ్యను సంపూర్ణాంగా ప్రైవేటీకరణ చేసి, కొందరు వ్యాపారుల చేతుల్లో పెట్టడానికి ఇది రాజమార్గం అవుతుంది.''  ... అని కొందరు ప్రభుత్వ టీచర్లు  ఆందోళన పడుతున్నారు.

ఇంకా వారు ఏమంటారంటే ...

'' ఈ పథకం వలన పుట్టగొడుగుల్లా వేల కొలది ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొస్తాయి. మీరు మీ పిల్లలను జాయిన్ చేస్తే చాలు అంతా ఉచిత విద్య ను అందిస్తాము. అమ్మ ఒడి పథకం డబ్బులు వచ్చాక ఇస్తే చాలు అనే ప్రకటనలు ఇంటింటికీ వచ్చి మొదలు పెడతారు ఈ చైతన్యా నారాయణా లాంటి స్కూల్స్ వాళ్ళు. ఉచితంగానే ప్రైవేట్ స్కూల్ లో విద్య వస్తుంటే ఇక ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా మూతపడతాయి. ఇదంతా ఒక్క సంవత్సర కాలంలో జరిగిపోయినా ఆశ్చర్యం లేదు.

"అసలు ప్రైవేట్ స్కూల్స్ వాళ్లకు కూడా డబ్బులు ఇస్తే తప్పేంటి? పేదల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదవ కూడదా?" అనిపిస్తుందా

"ప్రైవేట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. బలవంతంగా బట్టీ పట్టించి మార్కులు రప్పిస్తారు తప్ప, విషయ పరిజ్ఞానం లేని విద్యావిధానం. కోళ్ల ఫారాల్లాగా కిక్కిరిసిన తరగతి గదులు, ఆట స్థలాలు లేని పాఠశాలలు, ఒత్తిడితో కూడిన విద్య. ఇక ఆత్మ హత్యలు అంటారా? కోకొల్లలు

నేటి ఆధునిక సమాజ తల్లి దండ్రులు వాళ్ల పిల్లలు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, టై కట్టుకుని షూ వేసుకుంటే అదే గొప్ప చదువు అనే భ్రమలో ఉండటం వల్ల మాత్రమే, ఈ నాణ్యత లేని విద్యా సంస్థలు మనుగడలో ఉన్నాయి.

ప్రభుత్వానికే గనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇన్నిన్ని డబ్బులు ప్రైవేట్ విద్యా సంస్థలకు దారబోసే బదులు, ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ ఎయిడ్స్ కీ, ఎడ్యుకేషనల్ టూర్స్ కి, ల్యాబ్ ఎక్విప్మెంట్ కీ, లైబ్రరీలకి, conceptual education కోసం అవసరమైన సామాగ్రిని సమకూర్చుకొనేలా నిధులు విడుదల చేయొచ్చు. అలాగే, ప్రజలకు కావాల్సిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు గ్రామానికి ఒక్కటి పెట్టినా ప్రైవేట్ బడుల రాకాసి కోరల నుండి పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కావాల్సింది అదనపు నిధులు & కాస్త శ్రద్ధ.

"అమ్మ ఒడి" పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే ఇస్తే, విద్యార్థుల సంఖ్య పెరిగి ,ఉపాధ్యాయులు పెరుగుతారు. తద్వారా నాణ్యమైన విద్య అందుతుంది.

మన ఇల్లు మరమత్తులు కు గురయితే మరమత్తులు చేయించి ఇవ్వాలి గానీ, మీరు అద్దె ఇంటికి వెళ్ళండి అద్దె డబ్బులు మేము ఇస్తాం అంటూ, సొంతంగా ఇల్లే లేకుండా చేసిన్నట్టు అవుతుంది. ఆ తరువాత అద్దె ఇంటికి కట్టాల్సిన రెంట్ ఎంత పెరిగినా కట్టుకోవాల్సిన విపత్కర పరిస్తితుల్లోకి నెట్టబడతాం. అందరూ చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సిన విషయం.

పావులర్ అయ్యే పధకాలను పక్కన పెట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో ఉంచొకొని, "అమ్మఒడి" పథకం నుండి ప్రైవేట్ పాఠశాలలను తొలగించమని, ఏపీ సీఎం YS Jagan Mohan Reddy గారిని కోరుచున్నాం... '' అని వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: