ఏపీ అసెంబ్లీ లో ఏకంగా 151 సీట్లతో తిరుగులేని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన వైసిపి సంచలనాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వైసిపి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు బీజేపీ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు సమాచారం. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్  పదవిని వైఎస్ఆర్‌సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.


లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించారు. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా  పనిచేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇక ఇప్పుడు ముందుగా డిప్యూడీ స్పీక‌ర్ ప‌ద‌విని త‌మిళ‌నాడులో డీఎంకే భారీగా లోక్‌స‌భ సీట్లు సాధించ‌డంతో ఆ పార్టీకి చెందిన తూత్త‌కుడి ఎంపీ క‌నిమొళికి ఇవ్వాల‌ని అనుకున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నిక‌ల‌కు ముందే పొత్తు పెట్టుకున్న డీఎంకే ఆ ప‌ద‌విని తీసుకునేందుకు నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది.


ఈ క్ర‌మంలోనే అమిత్ షా కొద్ది రోజుల క్రితం ఎన్డీయేలో చేరాల‌ని జ‌గ‌న్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే హోదా విష‌యంలో బీజేపీ నుంచి ఎలాంటి హామీ లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ ఈ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించారు. ఇక ఇప్పుడు మ‌రోసారి వైసీపీ ఆక‌ర్షించే క్ర‌మంలో వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనుకొంటున్నట్టుగా బీజేపీ నాయకత్వం నుంచి వైసీపీ అధిష్టానానికి స‌మాచారం అందింది. దీనిపై ఇంకా వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.


ఈ ఆఫ‌ర్‌ను స్వీక‌రించాలా ?  లేదా ? అనే అంశంలో ఇప్పుడు వైసీపీలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏపీకి హోదా, ఇత‌ర‌త్రా అభివృద్ధి నిధుల విష‌యంలో కేంద్రం మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని వైసీపీ కోరుకుంటోంది. ఈ టైంలో వాళ్ల నుంచి ఎలాంటి హామీలు లేకుండా వాళ్లు ఇచ్చిన ప‌ద‌వులు తీసుకుంటే రేపు ఏపీలో విప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌ల నుంచి బీజేపీతో అంట‌కాగుతున్నారు ? అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ విష‌యంలో జ‌గ‌న్ ఆచితూచి డెసిష‌న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ప‌ద‌వి స్వీక‌రించాల్సి వ‌స్తే ఎస్సీ, ఎస్టీ ఎంపీల్లో ఎవ‌రో ఒక‌రికి ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని టాక్‌..?


మరింత సమాచారం తెలుసుకోండి: