ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌న్నిహితుడ‌నే పేరున్న బీజేపీ నేత...ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది. ఏపీ సీఎం జగన్‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఇవాళ కలిశారు. అయితే, మోదీ ఆప్తుడు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అవ‌డం లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి వైసీపీ ఎంపీని ఎంపిక చేసేందుకేన‌నే ప్ర‌చారం ఓ వ‌ర్గం మీడియాలో సాగింది. 


అధికారక పార్టీకి భారీ మెజార్టీ ఉన్నా.. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకే ఇవ్వడం లోక్‌సభలో ఆనవాయితీగా వస్తోంది. ఇక అటు మిత్రపక్షాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ఈసారి ఆ ఆఫర్‌ను అధికార వైసీపీకి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ ఈ ఆఫర్‌పై సమాలోచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల నేప‌థ్యంలోనే....ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ఏపీ సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా అనే అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. 


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో స‌మావేశం అనంతరం ఎంపీ జీవీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పానని అన్నారు. జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, సమస్యలపైన మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం సహకారంపై చర్చించామన్న ఆయన.. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీ ఎంపీకి ఇచ్చే విషయమై తనకు సమాచారం లేదని జీవీఎల్‌ తెలిపారు. ఇదిలాఉండ‌గా, వైసీపీ తరపున గెలిచిన గిరిజన మహిళకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం కొస‌మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: