అవును 40 ఇయర్స్ ఇండస్ట్రీ కి 46 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమిటో మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే అందరికీ అర్ధమైపోయింది. విషయం ఏదైన సరే మంత్రుల దృష్టికి వెళ్ళకుండా తన దగ్గరకు తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశారు జగన్. క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసి విలీనం గురించి చర్చ వచ్చింది. ఆర్టీసిని విలీనం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ మొదలవ్వగానే ఉన్నతాధికారులు నివేదికను సిఎం ముందుంచారు.

 

ఆ నివేదికను అందుకున్న జగన్ రవాణా శాఖ మంత్రి పేర్నినానితో నివేదిక గురించి అడిగారు. నివేదికను చదివారా ? అంటూ మంత్రిని జగన్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులు నివేదికను తనకు చూపించలేదని సమాధానం ఇచ్చారు.  వెంటనే ఆ నివేదికను జగన్ మంత్రికి అందించి ఉన్నతాధికారులకు క్లాసు పీకారు. విషయం ఏదైనా సరే సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాతే విషయం తనదాకా రావాలని ఉన్నతాధికారులకు జగన్ స్పష్టం చేశారు.

 

విషయం ఏదైనా కానీండి మంత్రి-ప్రిన్సిపుల్ సెక్రటరీ స్ధాయిలోనే ఫైలన్ చేసేయాలని కూడా చెప్పారు. ఏ కారణం వల్లనైనా విషయం తనదాకా రావాలనుకుంటే అదేదో మంత్రి ద్వారానే తనకు చేరాలని చెప్పటంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, చంద్రబాబునాయుడు హయాంలో వివిధ శాఖల్లో ఏం జరిగేదో కూడా ఆయా మంత్రులకు తెలిసేది కాదు.

 

ప్రతీ విషయంలోను ముఖ్యమంత్రి కార్యాలయం, వివిధ శాఖల ఉన్నతాధికారులు మాట్లాడేసుకుని ఫైళ్ళను రన్ చేసేవారు. ఒకవేళ మంత్రులెవరైనా అడిగితే చంద్రబాబు అర్జంటని చెప్పారు కాబట్టి ఫైలును నేరుగా సిఎంవోలో ఇచ్చేశామని చెప్పేవారు ఉన్నతాధికారులు. దాంతో మంత్రులు కూడా నోరెత్తేవాళ్ళు కాదు. దానికి తోడు చాలామంది మంత్రుల పేషీలు కూడా అత్యంత అవినీతిమయం అయిపోవటంతో మంత్రులు కూడా గట్టిగా మాట్లాడే ధైర్యం చేసేవారు కారు. అందుకే అన్నీ చోట్ల అవినీతి పెరిగిపోయింది.

 

సీన్ కట్ చేస్తే జగన్ ఇచ్చిన ఆదేశాలతో ఉన్నతాధికారులకు తత్వం బోధపడింది. చంద్రబాబు హయాంలో అధికారాలను చెలాయించినట్లు చెలాయించటం సాధ్యం కాదని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే అందరికీ అర్ధమైపోయింది. ఇక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తనకు తేడా ఏమిటో జగన్ స్పష్టంగా అందరికీ అర్ధమయ్యేట్లు చెప్పేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: