ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ దూకుడు తెలంగాణ‌లో కొత్త ఆందోళ‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. సీఎం పీఠం అధిరోహించిన నాటి నుంచి ప‌లు ప్ర‌జా సంక్షేమ నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం ద్వారా దేశం చూపును జ‌గ‌న్ త‌నవైపు తిప్ప‌కొంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ స‌మయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కొత్త డిమాండ్లు, ఆందోళ‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చేసిన ప్ర‌యోజ‌నాల‌ను త‌మ‌కు సైతం క‌ల్పించాల‌న్న‌ది వాటి సారాంశం. తాజాగా అదే జ‌రిగింది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెంచిన మాదిరిగానే తెలంగాణలోనూ మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని తెలంగాణ‌ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. అనేక కష్టతరమైన, దుర్భరమైన పని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరింది. ఈమేరకు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమర్‌ అలీ, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, ఆలోగా గత సాంప్రదాయం ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న వివిధ కేటగిరీవారీగా జీవో నెం 14 ఆధారంగా రూ 12వేలు, రూ 15వేలు, రూ 17వేలు వేతనాలు అమలు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపాల్టీలలో కూడా పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు పని చేస్తున్న వివిధ కేటగిరీలోని ఉద్యోగ,కార్మికులందరికి సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


కాగా, ఏపీ కేబినెట్ తొలి స‌మావేశంలోనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన  ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలపై సుమారు ఆరు గంటల సుదీర్ఘంగా చర్చించి ఉద్యోగులు, రైతులపై వరాల జల్లు కురిపించింది.మంత్రులు. అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు పథకం అమలు చేయాలని రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయించింది. రైతులకు వడ్డీలేని రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకురాబోతోంది ఏపీ సర్కార్. అటు ఆశా వర్కర్లు, కమ్యూనిటీ వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక వైఎస్సార్ ఆసరా పథకం కింద పింఛన్లను రూ.2250 పెంపును కేబినెట్ ఆమోదించింది. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: