సామాజిక విశ్లేషకులు Siddharthi Subhas Chandrabose . మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని  అంటారు ...
'' జగన్ , ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గ కూర్పు సరికొత్త, యవ్వనత్వపు,
ఆధునిక, అభ్యుదయ పోకడతో కూడిన పాలనకు బాటలు వేస్తాయని విశ్వసిస్తూ, గత ప్రభుత్వం అన్నివనరులు, శక్తులూ కేంద్రీకరించి
అన్ని ప్రాంతాల అభివృద్దిని పణంగా వొడ్డి నిర్మించదలచిన బ్రహ్మాండమైన రాజధాని అమరావతి  గురించి కూడా పునరాలోచించాలి. కారణం-
1. మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని ప్రపంచ ర్యాంకింగ్ లో ముందు వరుసలోని నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్.. నిరూపిస్తున్నాయి. ఇదే దేశంలోని కేరళ వంటి రాష్ట్రాలూ నిరూపిస్తున్నాయి.
2. ఇతర ప్రాంతాల వెనుకబాటుతనమ్మీద ఒకే ప్రాంతంలో పోగుపడిన విద్య,ఉపాధి, వైద్య అవకాశాల కారణంగా రాష్ట్రవిభజనలో హైదరాబద్ద్ విషయంలో జరిగిన అనుభవం గుణపాఠం కావాలి. భవిష్యత్తులో తప్పక మరిన్ని విభజనలుంటాయి, ఇది చారిత్రక అనివార్యత కూడా. కాబట్టి పాలనా విభజన జరగాలి ప్రాంతాలవారీగా ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలమీదుగా. కనీసం పక్కనున్న కర్ణాటకలో లాగా రెండుప్రాంతాలలో అసెంబ్లీ సమావేశాలు జరగాలి.
  
3. రాజధాని అంటే నగరానికో, ఎవరికో పోటీకాదు, అదొక పాలన సౌలభ్యత గలిగిన ప్రదేశం. దూరం అనేది ఒక విషయంగా పరిగణింపబడని ఈ వేగవంతమైన రవాణా కాలంలో అందరూ వూరికి దూరంగా, అవసరమైతే వేగంగా వూర్లోకి రాగలుగుతున్నప్పుడు, అసలు పనులనేవి ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా గాక టెలికాన్ఫరెన్స్ , వీడియో కాలింగ్, E- గవర్నెన్స్ ద్వారా జరుగుతోన్నప్పుడు ఇక అధికార యంత్రాంగమంతా ఒకే చోట వుండి పాలించాలిన అవసరత లేదు, అదిలేనప్పుడు ప్రపంచస్థాయి రాజధానులు అవసరంలేదు.


4.పూర్వం పాలకులు బ్రహ్మాండమైన నగరాలు, విగ్రహాలు నిర్మించేవారు, వాటిని చూసిన ప్రజలు రాజుపట్లా గౌరవం, భయం కలిగివుండి, అప్పనంగా పన్నులు సమర్పించుకుని కుక్కిన పేనుల్లా బ్రతికేవాళ్లు. ఇప్పుడు కూడా పిరమిడ్ల నిర్మాణాలూ, ఇడ్లీ స్టాండ్ నిర్మాణాల అవసరంలేదు. నిర్మించాల్సింది నగరాలు కాదు, ప్రజల విద్య, వైద్య, ఉపాధులు. అవి పెరిగితే వాళ్లే నగరాల్ని విస్తరింపజేసుకుంటారు. 
5. వెనుకబడిన ప్రాంతాలకోసం ప్రత్యేకనిధుల్ని కేంద్రం ఏటా మంజూరు చేస్తోంది. వాటిని రాజధానుల నిర్మాణానికి కేటాయింపు జరగకుండా చూడాలి.  


6.వాస్తవంలో కొత్త రాష్ట్రంకోసం శివరామన్ కమిటీ అన్ని రకాల పరిస్తితులని మదింపుచేసి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు, ఇవేవీకావని, కొన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక లెక్కల రీత్యా ఏర్పాటు చేసిన రాజధాని విషయంలో ఇప్పటికైనా, అంటే ఏ ఒక్క శాశ్విత భవనమూ నిర్మించనప్పుడు రాజధాని మార్పు ఆలోచించాలి. 
7. అమరావతి అనేపదం ఒకప్పటి ఈ ప్రాంత గొప్ప సంస్కృతీ వారసత్వాలకు ప్రతీక. అదిప్పుడు లేని గొప్పలతో, అసంబద్ధతలతో  భ్రమరావతి కారాదు.''




మరింత సమాచారం తెలుసుకోండి: