ఊసరవెల్లి...రంగులు మార్టుకునే ఓ జీవి.  ఈ జీవికి రంగులు మార్చుకనే శక్తి సృష్టి రీత్యా సంక్రమించింది.  కాని మనుషుల్లో కొందరు ఈ రంగు మార్చుకునే స్వభావాన్ని తమ స్వలాభం కోసం అలవర్చుకున్నారు.  పైగా వీరంతా చాలా వరకు ప్రజాసేవ చేసి ప్రజలను ఉద్దరిద్ధామని వచ్చిన ఉద్ధండులే.  ప్రజాసేవ గురించి కాస్త పక్కనపెజితే వీరి పొట్టకూటి కోసం ప్రజల పొట్టను కొడుతున్నారన్నది నిష్టూర సత్యం.  పొట్టకూటి కోసమే అయితే కాస్తో కూస్తో క్షమించొచ్చు, వీరి స్వార్ధస్వప్రయోజనాలకి ప్రజల నమ్మకాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వీరు నిజంగా ఊసరవెల్లులే.

ప్రస్తుత పరిస్థితిలో ప్రజాసేవ అంటే పదవి మరియు డబ్బు సంపాదనే.  ఎన్నికల ప్రచారంలో ‘నేను మీ కోసమే, మా పార్టీ ఉన్నది కూడా మీ కోసమే, అవతల పార్టీ అసలు పార్టీయే కాదు’ అంటూ నానా యాగీ చేసి ఓటర్ల మనస్సు గెలుచుకొని ఓట్లు దండుకున్నారు.  ఫలితాలు తారుమారైతే తాను తిట్టిన పార్టీలోనే చేరి తాను గెలిచిన పార్టీనే గేలి చేసి తమ సిగ్గులేని స్వార్ధపు రంగును బయటపెట్టుకుంటారు ఈ రాజకీయ ఊసరవెల్లులు. 

ఎన్నికలపుడు వారిని, వారి పార్టీ సిద్ధాంతాలు నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కించిన ప్రజలు పిచ్చివాళ్ళా... ఇటువంటి రంగులు మార్చేది వ్యక్తులైతే గుర్తించవచ్చు దశాబ్దాలుగా మనల్ని ఏలుతున్న ఒక పార్టీ అయితే మనమేంచేయగలం. ఆ పార్టీయే కాంగ్రెస్ పార్టీ.  భారతదేశం బయట వాళ్ళ నుండి విముక్తి పొంది స్వాతంత్ర్యం తెచ్చుకోగలిగిందేమో కాని లోపల వున్న కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాలనుండి మాత్రం అరవై ఏళ్ళ వరకు నలుగుతూనేవుంది.  నేటికీ ఆ పార్టీ నాయకులు అటు ఆంధ్రాకాని, ఇటు తెలంగాణాకాని తమ ఉనికిని ఊసరవెల్లి రూపంలో చాటుతూనే వున్నారు.  దానికి వర్ధమాన సాక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం.  పేరుకు విలీనమైనా పార్టీ ఫిరాయింపులే అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇంతా చేసి తెలంగాణ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ‘అవును మేము ఊసరవెల్లులం’ అని (వారి భాషలో మేము బర్రెలమా, గొర్రెలమా అని అన్నారు).  మరీ విడ్డూరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం సడలిందని అందుకే తాము పార్టీమారామని చెప్పుకొచ్చారు.

కాని సదరు ఊసరవెల్లులారా అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలు మీకు ఓటేశారన్న కించిత్తు కినుకయినా వుందా మీకు. కొంతకాలం తరువాత ఇప్పుడున్న పార్టీ కూడా మారరని గ్యారంటీ ఏమిటి?  అటు తెలంగాణలో పరిస్థితి ఇదయితే ఇక ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు మహా ఘటికులు.  వారికన్నా వీరు ఒక ఆకు ఎక్కువే చదివారు. నాటి కాంగ్రెస్ నాయకులు, నేటి వైఎస్ ఆర్ పార్టీ నాయకులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురద జల్లారో అందరికీ విదితమే. ఒక దశలో ప్రపంచంలోని ఇంతటి నేరగాడు ఇంకెవరూ ఉండరన్న వీరు నేడు జగన్ గారి అడుగుజాడల్లో నడుస్తూ తమ రంగును మరో సారి మార్చి చూపుతున్నారు.  రాజకీయాల్లో అన్ని సర్వసాధారణ మనకున్నా డబ్బు, పదవి కోసం ఇంతలా దిగజారాలా.

అధికారంలో ఏ పార్టీ వున్నా ఆ పార్టీ రంగును పులుముకునే ఊసరవెల్లులు మన మధ్యనే మనల్ని వెన్నంటివున్నాయి. పైగా ఈ ఊసరవెల్లులు మన పాలకుల రూపంలో మన నెత్తి మీదున్నారు. రంగు మార్చినా, మార్చకపోయినా ఊసరవెల్లి అని గుర్తు పెట్టడం కష్టం కావున మనమే జాగ్రత్తగా వుండడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: