ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ముగిసింది. రెండోవ రోజు ఏపీ శాసనసభ సమావేశాలు అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 


23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని  సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. ‘‘ముగ్గురు ఎంపీలను ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది. ప్రజలు గూబ గుయ్యి.. అనేట్టు కొట్టారు. అన్యాయం చేసిన వాళ్లకు.. అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే ముగ్గురు ఎంపీలు గెలిచారు. అది కూడా 23వ తేదీనే తీర్పు ఇచ్చారు. దేవుడు తీర్పు ఇచ్చాడు.  నేను కూడా చంద్రబాబు మాదిరిగా ఆలోచించి ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదు.

నాతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాలా..?  నేను ఏ విధంగా విలువలు పాటించానో అందరికీ తెలుసు. నేను కూడా ప్రలోభ పెడితే ఎంతమంది మిగులుతారో చూస్తాను. ఈ అన్యాయమైన సంప్రదాయానికి స్వస్తి పలకాలి, అసెంబ్లీలో మంచి సంప్రదాయం రావాలి’’ అని జగన్‌ అన్నారు. అంతకు ముందు అంబటి రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సభా సంప్రదాయాలను గౌరవించడం లేదని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన సభాపతిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేదని, ఇదెక్కడి సంప్రదాయమని వ్యాఖ్యానించారు.


సీఎం జగన్ వ్యాఖ్యలకు స్పందించిన బాబు
తొలి ప్రసంగంలోనే జగన్‌ ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని బాబు అభిప్రాయ పడ్డారు . ‘‘సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. 1978లో రెడ్డి కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగురోజుల్లోనే పార్టీ మారారు. అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తిగారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి. తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్నవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.

మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి. అధికార పక్షం సంప్రదాయాలు పాటించకపోయినా మేము పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్‌ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా. ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తే బాగుండేది. గతంలో స్పీకర్‌ను ఎంపిక చేశాక మంత్రులను జగన్‌ వద్దకు పంపించి నామినేషన్లు వేయించా. కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వాళ్లు కూడా సంతకాలు చేశారు. స్పీకర్‌ ఎన్నికపై కనీసం ఒక్కమాట అయినా చెబుతారని ఎదురుచూశా’’ అని చంద్రబాబు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: