ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన TRS పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావును ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్ఎస్‌ పక్ష నాయకుడిగా కేశవరావును ఎన్నుకున్నారు.


టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేతగా ఎన్నికైన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ, పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తానని చెప్పారు. గతంలో ఐదేళ్లపాటు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. తాను లోక్ సభ పక్షనేతగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా పార్లమెంట్ లో ఉన్నారని గుర్తుచేశారు. గతంలో చూశారు కాబట్టే.. ఇపుడు ఆ బాధ్యతలు ఇచ్చారని అన్నారు. 


ఖమ్మంలో ఓ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వలేదు అని ఓ ఆరోపణ ఉంది.. దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు నామా నాగేశ్వరరావు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “నేను తెలంగాణలో పెద్ద ఉద్యమకారుడికిందే లెక్క. 15వ లోక్ సభ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. తెలంగాణ బిల్లుపై ఓటేసే అదృష్టం నాకు కలిగింది. మొదటి నుంచి కూడా నేను తెలంగాణ బిడ్డను. తెలంగాణ వాదిని. అన్నీ చూసే ఖమ్మంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. జనం కూడా నన్ను గెలిపించారు” అని నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ విధానం ప్ర‌కారం పార్లమెంట్ లో అందరినీ కలుపుకుపోతానని నామా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: