తమ్మినేని సీతారాం రాజకీయ జీవితంలో 25 ఏళ్ళు టీడీపీలోనే గడచింది. 2008 ప్రజారాజ్యం పార్టీ పెట్టేంతవరకూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. అందులోనే ఆయన అయిదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి తన సత్తా చాటుకున్నారు. అన్న నందమూరి పిలుపు మేరకు  1983లో నవ యువకుడిగా పార్టీలో చేరిన తమ్మినేని రాజకీయ సంధ్యా సమయంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు.


తమ్మినేని శ్రీకాకుళం రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన అక్కడ వర్గ పోరుకు దూరంగా తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని  పార్టీకి బద్దుడై పనిచేశారు. ఓ దశలో చంద్రబాబుతోనే సవాల్ చేసి టీడీపీని వీడి వెళ్ళిపోయారు. ఆ తరువాత మళ్ళీ కళా వెంకటరావు తదితరులు సైకిలెక్కినా తమ్మినేని మాత్రం బాబు విధానాలను నిరసిస్తూ పదకొండేళ్ళ పాటు సుదీర్ఘ  పోరాటం చేశారనే చెప్పాలి.


వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన సీతారాం కి సొంత మేనల్లుడు కూన రవికుమార్ చేతిలో పరాభవం ఎదురైంది. తిరిగి 2019 ఎన్నికల్లో అదే రవికుమార్ ని భారీ మెజారిటీతో ఓడించి మామ దెబ్బ ఇదీ అని నిరూపించుకున్నారు. ఇక తమ్మినేనిని ఈ ఎన్నికల్లో ఓడించడంటూ చంద్రబాబు శ్రీకాకుళం ప్రచారంలో గొంతెత్తి నినదించారు. అయినా జనం ఆయన్నే గెలిపించారు. ఇపుడు వీరుడిగా నిలిచి స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేనిని  అధ్యక్షా అని పిలవడం బాబు వంతు అయింది. దటీజ్ తమ్మినేని.


మరింత సమాచారం తెలుసుకోండి: