అదేంటి...వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంటే భ‌గ్గున‌మండే జ‌న‌సేన పార్టీ నేత‌లు ఎందుకు జ‌గ‌న్ విష‌యంలో ఖుష్ అవుతున్నారు? ఇటీవ‌లి కాలంలో అన్నివ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారుతున్న జ‌గ‌న్ ప‌రిపాల‌న జ‌న‌సేన పార్టీ నేత‌ల‌కు సైతం ఖుషీ క‌బురు అందించార‌ని అంటున్నారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫిరాయింపుల విష‌యంలో తాను, త‌న పాల‌న ఆద‌ర్శంగా నిల‌వాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ ఈ మేర‌కు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేయ‌డం జ‌న‌సేన పార్టీ నేత‌ల సంతోషానికి కార‌ణం.


అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజు సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ, ప్ర‌జాస్వామ్యంలో చట్ట సభల విలువలు కాపాడాలని, మంచి ముఖ్యమంత్రిగా ఉండాలనేదే తన అభిమతమన్నారు. గత శాసనసభలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పట్టించుకోలేదని చెపుతూ అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారంటూ అధికార సభ్యుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల నుంచి 23మందిని తీసుకోవడమే కాక నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. ప్రతిపక్ష బెంచీల్లో ఉండాల్సిన వాళ్లను ట్రజరీ బెంచీల వైపు తీసుకొని అధికార పక్షంలో కూర్బోబెట్టారన్నారు. దేవుని స్క్రిప్టు చాల గొప్పదని చెపుతూ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన పార్టీకి అక్షరాలా 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యులు మాత్రమే మిగిలారన్నారు. అది కూడా 23వ తేదీనే వచ్చినట్లు చెప్పారు. దేవుని గొప్ప స్క్రీన్‌ప్లేకి ఇది నిదర్శనమన్నారు. బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ, గాడ్స్‌ గ్రేస్ మళ్లీ ఇవాళ చూస్తున్నామన్నారు. కొందరు తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లలో ఐదుగురిని గుంజితే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారని పేర్కొన్న జ‌గ‌న్‌... అయితే అలా చేస్తే చంద్రబాబు నాయుడుకు తనకు తేడా ఉండదని చెప్పానన్నారు. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినైనా తీసుకుంటే రాజీనామా చేయించి మరీ తీసుకుంటామన్నారు. లేకుంటే అనర్హత వేటు వేయండి అంటూ ఇప్పుడే మీకు చెపుతున్నానని స్పీక‌ర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.


కాగా, జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కేవ‌లం ఒక్క చోట మాత్ర‌మే గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓట‌మి పాల‌య్యారు. అయితే, గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. జ‌గ‌న్‌తో అభివృద్ధి విష‌యంలో క‌లిసి ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రింత క‌ల‌వ‌రానికి దారితీసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ తాను ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌బోన‌ని తేల్చిచెప్ప‌డం ద్వారా..జ‌న‌సేన ఊపిరి పీల్చుకుంటోంద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: