తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మ‌రోమారు ఒకే వేదిక మీద‌కు రానున్నారు. విజ‌య‌వాడ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ స్వామీజీ స‌న్యాసికారి దీక్ష‌ను చేయ‌నున్నారు.. అమ‌రావ‌తిలో ఈ దీక్ష 15వ (రేపటి నుంచి) తేది నుంచి 17వ తేది వ‌ర‌కూ కొన‌సాగనుంది.ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌,తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజ‌ర‌వుతున్నారు.


విజ‌య‌వాడ దుర్గమ్మను దర్శించుకున్న స్వ‌రూపానందేంద్ర అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15, 16, 17న లోక కల్యాణార్థం సన్యాసికారి దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయ భూములు, వ్యవస్ధలు, టీటీడీలో అగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం విశాఖపీఠం మాత్రమేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటం కోసం పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. 


ఇదిలాఉండ‌గా, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్‌ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్‌ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్‌ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు. సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం  నిర్వహిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: