ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్  చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానం పై స‌భ స‌మావేశ‌మైంది. అయితే, ఈ క్ర‌మంలో వైసీపీ అభ్య‌ర్థి, నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకుంటున్న వైసీపీ ఫైర్‌బ్రాండ్ కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి.. ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా నెల్లూరు నాయ‌కులు స‌హా సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న బృందంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వాడి వేడిగా సెగ పుట్టించాయి. టీడీపీ వాళ్ల‌పై కాకాని ఘాటైన వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు విరుచుకు ప‌డుతూ ఉంటారు.


కాకాని ఎప్పుడు ఏం బాంబు పేలుస్తారో ? అన్న ఆందోళ‌న కూడా టీడీపీలో ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటూ.. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను తొలుత ప్ర‌స్థావించిన‌కాకాని.. వీటిని త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లుగా పేర్కొంటూ.. దుమ్మెత్తి పోశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ నేత‌ల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొడుతూ.. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో స‌ద‌రు నేత ఎందుకు చ‌నిపోయారో వ‌చ్చిన వార్త‌ల‌ను స‌భ‌లోనే ప్ర‌ద‌ర్శించారు. 


టీడీపీ నేత‌గా ఉన్న వ్య‌క్తిని.. వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో ఆయ‌న భార్యే మ‌ట్టుబెట్టిన‌ట్టు ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. అయితే, ఈ హ‌త్య‌ను వైసీపీ నాయ‌కులు చేశారంటూ.. బాబు ప్ర‌చారం చేయ‌డాన్ని కాకాని నిప్పులు చెరిగారు. ఇక‌, బీసీల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెప్పుకొన్న చంద్ర‌బాబు.. వారిని త‌న రాజ‌కీయాల‌కు అనుకూలంగా వాడుకున్నార‌ని విమ‌ర్శించారు. బీసీల‌కు 100 సీట్లు ఇస్తామ‌ని చెప్పుకొన్న‌ చంద్ర‌బాబు.. టీడీపీ ఎక్క‌డ ఓడిపోయే ప‌రిస్థితి ఉంటే.. అక్క‌డ బీసీల‌కు టికెట్‌లు ఇచ్చి అవ‌మానించారి విమ‌ర్శించారు. 


ఇక‌, అవినీతి ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ క‌బుర్లు చెప్పిన చంద్ర‌బాబు బృందం అంతా కూడా అవినీతి మ‌య‌మేన‌ని, దీనికి ప‌క్క‌నే ఉన్న గుర‌జాల టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మ‌ని కాకాని వ్యాఖ్యానించారు. ఇక‌, స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేసి వ‌రుస ప‌రాజ‌యాలు పొందిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహాన్ని సైతం ఈ సంద‌ర్భంగా కాకాని వెల్ల‌డించి స‌భ‌లో న‌వ్వులు పూయించారు. బాబు వీక్ నెస్(పొగ‌డ్త‌లు) సోమిరెడ్డికి తెలుసున‌ని, సోమిరెడ్డి వీక్ నెస్(మంత్రి ప‌ద‌వి) బాబు కు తెలుసున‌ని, అందుకే ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగా కుదిరి.. రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని ఆయ‌న చేసిన ప్ర‌సంగంతో బాబు బ్యాచ్ నివ్వెర పోయింది. మొత్తానికి స‌భ‌లో కాకాని అద‌ర‌గొట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: