ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తి అంశం స‌మ‌స్య‌గానే మారుతోంది. ఓ వైపు ఇప్ప‌టికే పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ తాను ప‌ద‌విలో ఉండ‌నంటే...ఉండ‌నంటూ మొండికేస్తుండ‌గా...కాంగ్రెస్ పార్టీ ముందు ఇంకో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అయిన‌ప్ప‌టికీ...లోక్‌సభలో తమ పక్ష నేత పేరును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు.పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భం గా ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటీకి లోక్‌సభ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి (బెంగాల్), కే సురేశ్ (కేరళ) హాజరయ్యారు. వీరితోపాటు కేంద్ర మాజీ మం త్రులు మనీశ్ తివారీ, శశి థరూర్ లోక్‌సభ నేత పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లిష్‌పై తిరుగులేని పట్టు గల శశిథరూర్ హిందీలోనూ మాట్లాడగలరు కానీ.. ఆయన భార్య సునంద పు ష్కర్ మృతి కేసు ప్రధాన అడ్డంకయ్యే అవకాశాలున్నాయి.


గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. కేరళ నేత సురేశ్, అధిర్ రంజన్‌లకు హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు తక్కువ. ఆనంద్ సాహిబ్ ఎంపీ మనీశ్ తివారీకి హిందీ, ఇంగ్లిష్ భాషలపై సమాన పట్టు ఉన్నది. అయితే ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి నిరాకరించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభలో పార్టీ నేత, ఉప నేత, చీఫ్ విప్, ఇద్దరు విప్‌లను నియమించేందుకు కాంగ్రెస్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉన్నది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం చెబుతున్నది. మరోవైపు నియామకాల్లో హస్తం పార్టీ.. ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉన్నది. మరోవైపు కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాల్లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఇప్పటికీ లోక్‌సభలో తమ పార్టీ నేత పేరు ఎంపిక చేయలేదన్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు స్పంది స్తూ.. పలు పార్టీలు ఇంకా తమ పక్ష నేతల పేర్లను ఖరారు చేయలేదన్నారు.


పార్ల‌మెంట్‌కు కొత్త‌గా ఎంపీకైన ఎంపీలంతా ఇవాళ 17వ లోక్‌స‌భ ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ఈ సారి లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌ర‌న్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది. ఒక పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కాలంటే.. ఆ పార్టీకి క‌నీసం 55 మంది ఎంపీలు ఉండాలి. కానీ ప్ర‌స్తుత లోక్‌స‌భ‌లో అన్ని సీట్లు ఉన్న పార్టీ ఏదీ లేదు. గ‌త లోక్‌స‌భ‌లోనూ మ్యాజిక్ నెంబ‌ర్ దాటిన ప్ర‌తిప‌క్షం లేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 52 సీట్లు గెలుచుకున్న‌ది. అయితే ప్ర‌తిప‌క్ష హోదా కోసం ఇంకా మూడు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచిపోయింది. నిజానికి 55 సీట్లు ఉంటేనే ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తార‌న్న నియ‌మం క‌చ్చితంగా పాటించాల్సి అవ‌స‌రం లేదు. ఒక‌వేళ స్పీక‌ర్ త‌న ర‌హ‌స్య అధికారాల‌ను వినియోగిస్తే.. దాని ప్ర‌కారం లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఇటీవ‌ల సోనియా గాంధీ ఎంపికైన విష‌యం తెలిసిందే. అయితే లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆమెకు అవ‌కాశం ద‌క్కుతుందా లేదా అన్న అంశం కోసం ఎదురుచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: