ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య మంచి వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా గురించి మొదటినుండి ఆరాటపడింది తామేనని పేర్కొన్నారు.

 

ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.  హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే,  సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స  సత్యనారాయణ సవాల్‌ చేశారు. వారిరువురి మధ్య వాగ్విదాలు మిన్నంటాయి.

 

హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు.

 

కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే మార్పులు ప్రజలు కళ్లారా చూడబోతారని భవిష్యత్తుని చెప్పారు. చూద్దాం మరి, వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ప్రజలను నలిపేస్తారా లేక ఆంధ్ర రాష్ట్రాన్నేమైనా ఉద్ధరిస్తారా భవిష్యత్ తెరపై చూద్దాం మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: