ఏపీ ఎన్నికల్లో వైసీపీ దెబ్బతో టీడీపీ నుంచి మహామహులే చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. ఈ రెండు చోట్ల పవన్‌పై వైసీపీ అభ్యర్థులే గెలవడం విశేషం. పవన్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలోని భీమవరం నుంచి పవన్ పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. పశ్చిమగోదావరి పవన్ సొంత జిల్లా కావడం... అందులోనూ పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఒక ఎత్తు అయితే తన సోదరుడు నాగబాబును కూడా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. దీంతో భీమవరంలో వైసీపీ గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. 


గ్రంధి శ్రీనివాస్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి అక్కడ పవన్ ను ఓడించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో గ్రంధి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియార్టీతో పాటు కాపు సామాజిక వర్గం కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ కాపు కోటాలో జిల్లా నుంచి మరో సీనియర్ నేత ఆళ్ల నానికి మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో గ్రంధి శ్రీనివాస్ కాస్త అలిగిన‌ట్టు టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విషయం తెలుసుకున్న జగన్ అన్న నువ్వు సాధించిన విజయం అపూర్వం. మీ ఫ్యూచర్ నాది, మీకు ఖ‌చ్చితంగా భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారట. 


గ్రంథికి ఏ పదవి ఇస్తానన్నది జగన్ చెప్పకపోయినా... రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే ప్రక్షాళనలో ఆయనకు ఖ‌చ్చితంగా మంత్రి పదవి వస్తుందని... పవన్ కళ్యాణ్‌ను ఓడించిన గ్రంథికి జగన్ తప్పకుండా తన కేబినెట్‌లో స్థానం ఇస్తారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఏదేమైనా జగన్ హామీతో గ్రంధి ఫుల్ ఖుషి అయినట్టు తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జగన్ పూర్తిగా తన ఎలక్షన్ కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త వాళ్లకు కేబినెట్‌లో చోటు ఇస్తారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: