భూమా అఖిలప్రియ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తల్లిదండ్రులు దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయంగా తెరమీదకు వచ్చారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై అనూహ్యంగా మంత్రి అయ్యారు. తల్లి శోభానాగిరెడ్డి మృతితో అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా గెలిస్తే... తండ్రి భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఆమెకు మంత్రి పదవి వచ్చింది. చిన్నవయసులోనే తనకు మంత్రి పదవి రావడంతో... అంది వచ్చిన ఆ పదవితో తనకు తానుగా వ‌న్నె తెచ్చుకోవటం మర్చిపోయిన అఖిల ప్రియ రెండేళ్లలోనే తీవ్రమైన వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. 


రాజకీయంగా అనుభవం లేకపోవడం ఒక మైనస్ అయితే... కనీసం ప్రజల్లోకి ఎలా ? వెళ్లాలో కూడా తెలియకపోవడం, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ కావ‌డంతో రాజ‌కీయంగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి సారే ఓడిపోవాల్సివ‌చ్చింది. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి ఏకగ్రీవంగా గెలిచిన అఖిల తాజా ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. వాస్తవంగా చూస్తే భూమా ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడిని అఖిల తొలిసారిగా వివాహం చేసుకుంది. అయితే వీరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయిన అఖిల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 


ఇక గత ఎన్నికల తర్వాత భూమా నాగిరెడ్డి  టీడీపీలో బలవంతంగానే చేరారని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూమాపై కక్షపూరిత వైఖరి అవలంబించడంతో... వాటిని తట్టుకోలేక ఆయన పార్టీ మారారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. చాలా రోజులు వెయిట్ చేసిన భూమాకు మంత్రి పదవి రాకపోవడంతో ఆ మనోవేదనతోనే గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే బాబు తెలివిగా తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు తన కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా  అఖిల‌కు అవకాశం ఇచ్చారు. ఇక భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటును కూడా ఆ ఫ్యామిలీకి చెందిన బ్రహ్మానందరెడ్డికి ఇవ్వటం ఆయన ఘన విజయం సాధించడం జరిగిన సంగతి తెలిసిందే. 


ఈ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిల ప్రియతో పాటు... నంద్యాల నుంచి పోటీ చేసిన బ్రహ్మానంద రెడ్డి ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో అఖిల ఓడిపోవటానికి తన స్వీయ తప్పిదాలు ప్రధాన కారణాలు. భూమా నాగిరెడ్డికి అండగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు, పార్టీ సీనియర్ నాయకులు వైసీపీలో చేరడంతో అఖిల‌ టిడిపిలో ఒంటరిగా మిగిలిపోయారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అటు ఎలాగో జగ‌న్ ఫ్యామిలీతో భూమా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉండ‌నే ఉన్నాయి. ఇక జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో అఖిల‌కు ఉన్న చ‌నువు నేపథ్యంలో అఖిల విజ‌య‌మ్మ ద్వారా వైసీపీలో చేరే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. 


ఎన్నికలకు ముందే అఖిల మేనమామ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు టిడిపిలో ఉన్నా ప్రజలు ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. అటు టిడిపి పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ఈ క్రమంలోనే అఖిల పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలను కూడా ఖండించకపోవడం ఆమె పార్టీ మారుతున్నారు అన్నదానికి మరింత బలం చేకూరినట్లయింది. అయితే జగన్ అఖిల విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: