మొన్న స్పీకర్ ఎంపిక సందర్భంగా చేసిన తప్పును తాజాగా చంద్రబాబునాయుడు దిద్దుకున్నారు. స్పీకర్ గా  తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే తమ్మినేనిని స్పీకర్ గా బాధ్యతలు తీసుకునేటపుడు శాసనసభా పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వేదిక మీదకు వచ్చారు.

 

అయితే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు మాత్రం రాలేదు. చంద్రబాబు తాను రాకుండా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పంపించారు. పైగా చంద్రబాబు సభలోనే ఉండి అచ్చెన్నను పంపటం పెద్ద వివాదాస్పదమైంది. ఇదే విషయమై అసెంబ్లీలో వైసిపి నేతలంతా కలిసి చంద్రబాబును వాయించేశారు.

 

వివాదంలో నుండి బయట పడేందుకు తమను ఎవరూ ఆహ్వానించలేదని, స్పీకర్ ఎంపికపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని చంద్రబాబు సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు చెప్పిందంతా అబద్దాలే అని తేలిపోయింది.

 

అప్పటి వరకూ ప్రోటెం స్పీకర్ గా ఉన్న సంబంగి చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేనిని కుర్చీలో కూర్చోబెట్టేందుకు అన్నీ పక్షాల నేతలను రమ్మని తానే ఆహ్వానించిన విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో ఇంకేం చెప్పాలో అర్ధంకాక చంద్రబాబు అండ్ కో మాట్లాడలేకపోయారు.

 

తాజాగా డిప్యుటి స్పీకర్ గా ఎంపికైన కోన రఘుపతి కుర్చీలో కూర్చునే విషయంలో జగన్ తో పాటు చంద్రబాబు కూడా వచ్చారు.  అంటే స్పీకర్ విషయంలో చేసిన తప్పును డిప్యుటి స్పీకర్ ఎంపిక సందర్భంగా చంద్రబాబు దిద్దుకున్నట్లైంది. మొత్తానికి స్పీకర్ విషయంలో సభలో రచ్చ రేగితే డిప్యుటి స్పీకర్ విషయంలో మాత్రం ప్రశాంతంగా జరిగి పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: