అసెంబ్లీలో చంద్రబాబునాయుడు అండ్ కో అనవసరంగా చెత్తను నెత్తినేసుకుంటున్నారు.  గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా సాగిందో, ఎంత అవినీతి జరిగిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షల్లో ఒక్కో విషయం బయటపడుతోంది.

 

సరే మిగిలిన విషయాలు ఎలాగున్నా ప్రత్యేకహోదా విషయంలో మాత్రం చంద్రబాబు ఘోరమైన తప్పిదాలు చాలానే చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమని రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే చంద్రబాబును జగన్ తో పాటు వైసిపి నేతలు అవకాశం దొరికినపుడల్లా ఏకిపారేశారు.

 

అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెడతారా ? ఇపుడు అసెంబ్లీలో జరిగిందిదే. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడు నెలల పాటు ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ఎందుకు నోరిప్పలేదు ? అంటూ జగన్ నిలదీశారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి వీలుగా తెలంగాణాలోని ఏడు మండలాలను ఏపిలో కలిపితే కానీ ప్రమాణ స్వీకారం చేయనని ప్రధానమంత్రికే గట్టిగా చెప్పానని గొప్పగా చెప్పుకున్నారు.

 

అదే విషయాన్ని తర్వాత  జగన్ ప్రస్తావిస్తు ముంపు మండలాల విషయంలో ప్రధానితోనే అంత గట్టిగా మాట్లాడినపుడు మరి ప్రత్యేకహోదా మాత్రం ఏం పాపం చేసింది ? హోదా కోసం ప్రధానితో ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదు ? అంటూ ఎదురు ప్రశ్నించారు. దాంతో ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక జగన్ ను గుర్రుగా చూస్తుండిపోయారు.

 

అంతకుముందు హోదా విషయంలో 5 కోట్ల ప్రజలతో పాటు రాజకీయపార్టీలతో కలిసి టిడిపి కూడా ఉద్యమాలు చేసిందన్నట్లుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పెద్ద బిల్డప్ ఇవ్వబోయారు. దాంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గట్టిగా వాయించేశారు. హోదా విషయంలో చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలను తేదీలతో సహా చెప్పేసరికి టిడిపి నుండి మళ్ళీ ఎవరు నోరిప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: