కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలపై తన పోరాటం కొనసాగుతుందని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న భవనం కూడా అక్రమ కట్టడమేనని.. దానిని ఖాళీ చేయించేవరకూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

 

మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నగరంలో ఇల్లు లేని చంద్రబాబు అమరావతిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాజధాని నగర పరిధిలో సీఆర్‌డీఏ చేపడుతున్న పనులు ఎందుకు ఆపారో ఆ కాంట్రాక్టర్లనే అడగాలని సూచించారు.

 

కాంట్రాక్టర్లకు అనుమానాలుంటే ప్రభుత్వాన్ని కలవాలన్నారు. ఎక్సెస్‌ టెండర్లను ఎలా ఇస్తారని.. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సీఆర్‌డీఏ చైర్మన్‌గా సీఎం ఉంటారని.. ఆ పదవి తనకు ఇచ్చే విషయం తెలియదని అన్నారు.

 

శాసనసభ ప్రాంగణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ లోకేశ్‌ ఎదురుపడ్డారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. మంగళగిరిలో తనపై విజయం సాధించిన ఆళ్లకు లోకేశ్‌ ‘కంగ్రాట్స్‌’ చెప్పి అభినందించారు. లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వీరిద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు అక్కడ ఉన్నవారిలో ఆసక్తిని కలిగించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: