పెన్షన్‌ డబ్బులతో అతడేం చేశాడో తెలుసా?
 ఎవరైనా మలి వయసులో జీవితం హాయిగా వుండాలని అనుకుంటారు. వచ్చిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. ఇంకొందరు పదవీ విరమణ తరువాత మనవళ్లతో ఆడుకుంటా కూల్‌గా జీవిస్తారు... ఇదీ లోక రీతి... కానీ ఒడిస్సాలోని, కియోంజిహార్‌ జిల్లా కాన్పూర్‌ గ్రామానికి చెందిన గంగాధర్‌ రౌత్‌ మాత్రం అందరిలా ఆలోచించలేదు.

సమాజం కోసం ఆలోచించాడు. పెన్షన్‌ డబ్బులను ఒక లక్ష్యం కోసం ఉపయోగించుకోవాలనుకున్నాడు. తన ఊరు నుండి బయటకు పోవాలన్నా, రావాలన్నా ..సాలంది నదిని దాటాల్సిందే. వరదలు వచ్చినా, వానలు కురిసినా ఊరుకు కష్టం వచ్చేది. ఎప్పుడు వరద వచ్చి ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. తమకు వంతెన కావాలని గ్రామస్తులు ఎన్నో సార్లు స్ధానిక అధికారులకు వినతులు సమర్పించారు. సమస్య తీరలేదు. సమస్య తీవ్రతను గమనించిన గంగాధర్‌ రౌత్‌ మాత్రం ఎంత ఖర్చయినా సరే వంతెన పూర్తి కావాలని తపించాడు. తానే ఆ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

 పశు సంవర్దక శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన రౌత్‌ తమ ఊరి సమస్యను తానే చక్కదిద్దాలనుకున్నాడు. ఈ పనిని సామాజిక బాధ్యతగా గుర్తించాడు. ఇందు కోసం తానే ముందుకు కదిలాడు. 270 అడుగుల వంతెనను, కాన్పూర్‌ నుంచి దానేపూర్‌ గ్రామం వరకు యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం మొదలు పెట్టాడు.

ఆయన చేస్తున్న పనిని చూసి సిగ్గుపడిన అధికారులు ..6 లక్షల రూపాయలు మంజూరు చేశారు . గంగాధర్‌ రౌత్‌ 12 లక్షలను బ్రిడ్జి నిర్మాణం కోసం అందజేశారు. తనలోని మానవత్వం బతికే ఉందని చాటారు. రౌత్‌ చేసిన జనహితం జాతీయ మీడియాలో వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్‌ రౌత్‌ను వెతుక్కుంటూ వచ్చి, ప్రత్యేకంగా అభినందించారు. కొన్ని దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య ఒక మంచితనం తో పరిష్కారం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: