అందుతున్న వార్తల ప్రకారం గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపయోగించిన  సీఎం క్యాంప్ కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సర్కార్ ఆదేశాలతో సీఆర్డియే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏపీ గవర్నర్ అధికారిక కార్యాలయం నివాసం కోసం సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఎంపిక చేసే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. తొందరలో నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. 


ప్రస్తుతం గవర్నర్ కు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక వసతి లేదు. ఆయన వచ్చినప్పుడల్లా ఏదైనా స్టార్ హోటల్ లో వసతి ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అనవసర ఖర్చును నియంత్రించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం జగన్ తన తాడేపల్లి నివాసాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని పని చేస్తున్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గవర్నర్ వస్తున్నారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 


కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్గ వర్నర్‌గా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం కాదని సుష్మాయే స్వయంగా ట్వీటర్ ద్వారా ఖండించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి గవర్నరుగా నియమితులై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకూ కొనసాగుతున్నారు. 2007లో ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా నియమితులైన నరసింహన్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: