స‌మ‌స్య‌, సంద‌ర్భం ఏదైనా ట్విట్ట‌ర్లో స్పందించే..తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్  తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తండ్రితో క‌లిసి విదేశీ యాత్ర‌కు వెళ్లివ‌చ్చిన త‌ర్వాత ట్విట్ట‌ర్లో వివిధ అంశాల‌పై స్పందించిన లోకేష్ ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టిస్తున్న ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన ఘ‌ట‌న‌పై జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టే విధంగా లోకేష్ ట్వీట్ చేశారు.

సభ్యసమాజం తలదించుకొనే విధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ ఘ‌టన జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న స్నేహితుడిని కలుసుకొనేందుకు ఆ బాలిక విజయవాడ నుంచి ఒంగోలు వచ్చింది. ఆమె స్నేహితుడు తమకు తెలుసని నమ్మించిన నలుగురు యువకులు ఒంగోలు బస్టాండ్ నుంచి ఆమెను తీసుకెళ్లారు. నాలుగు రోజులుగా ఓ గదిలో నిర్బంధించిన ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు. 


ఈ ఘ‌ట‌న‌పైనే లోకేష్ ట్విట్ట‌ర్లో స్పందించారు. `ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు  వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది.` అని వైఎస్ జ‌గ‌న్‌తో పాద‌యాత్ర‌లో స‌ద‌రు నిందితుడి దిగిన‌ట్లు ఉన్న ఫొటోతో లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండ‌గా, క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌మావేశంలో భాగంగా ఒంగోలులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ముఖ్యంత్రి ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ప్రకాశం ఎస్పీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వివరాలు వెల్లడించారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నామని ఎస్పీ పేర్కొన‌గా సీఎం అభినందనలు తెలిపారు. స‌ద‌రు బాధిత బాలిక‌కు పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీచేశారు. రూ. 5లక్షలు ప‌రిహారం ఇస్తామని హోంమంత్రి సుచరిత పేర్కొన‌గా పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: