ఇటీవల తనకు లేఖ రాసిన 11 ఏళ్ల ఓ బాలికకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి లేఖరాసి ఆమెను ఆశ్చర్యపర్చారు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఆరుషి యాదవ్‌ అనే బాలిక ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల మోదీకి ఆమె లేఖ రాస్తూ దేశ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహించాలని ఆమె సూచించింది.

 

‘డియర్‌ మోదీ జీ... మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మీరు ప్రధాని అయినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను... నేను పాఠశాలకు వెళ్లిన సమయంలో దాని చుట్టు పక్కల చాలా చెత్త ఉండడాన్ని గమనిస్తున్నాను. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను దీన్ని పాటిస్తాను.. దయచేసి నాకు రిప్లై ఇవ్వండి’’ అని పేర్కొంది.

 

తాజాగా మోదీ ఆ బాలికకు లేఖ రాశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకుగానూ శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు. అభివృద్ధే లక్ష్యంగా కొనసాగిస్తున్న మా రాజకీయాలపై, మంచి పాలనపై 130 కోట్ల మంది ప్రజలు నమ్మకాన్ని ఉంచి తీర్పును ఇచ్చారు. శక్తిమంతమైన, స్థిరమైన ప్రభుత్వం కోసం ప్రజలు ఓట్లు వేశారు. ఈ ప్రభుత్వం దేశ యువత ఆశలను నెరవేర్చగలదు...

 

గత ఐదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకుని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చింది. 2022లోపు దేశంలోని అందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు కావాలని, భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా చేయాలని ప్రణాళికలు వేసుకున్నాం. అంకుర పరిశ్రమలకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. అందరితో కలిసి అందరి కోసం అభివృద్ధి పనులను చేస్తాం. అవినీతి రహిత ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాం. శక్తిమంతమైన భారత్‌ను నిర్మిస్తాం’’ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: